రాజకీయ నాయకులు అంటే.. డబ్బులు వెనుక వేసుకుంటారు.. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టరు.. వారి ధ్యాసంతా డబ్బుమీదే అన్నది ఆల్మోస్ట్ ఓటుహక్కు వచ్చిన ప్రతి పౌరుడికి తెలిసిందే..! రాజకీయాల్లో కిందిస్థాయిగా చెప్పబడే వార్డు మెంబర్ కూడా లక్షలకు, కోట్లకు పడగలెత్తే రోజులివి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక వార్డు మెంబరే అంతలా డబ్బు వెనుక వేసుకుంటుంటే అతని పైస్థాయి రాజకీయ నాయకులు ఊరుకుంటారా? వాళ్లూ వాళ్ల స్థాయిని బట్టి డబ్బులు దండుకుంటారు. సీఎం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారమే అతని చేతిలో ఉంటుంది. ఐదేళ్ళు అతడు ఏమి చేస్తే అదే కరెక్ట్. కాంట్రాక్ట్ అని.. అదని ఇదని రాష్ట్రాన్నే అమ్ముకున్నా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు.


మన దేశంలో ధనిక సీఎంలు ఎవరైనా ఉన్నారా? అంటే దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు ఆ జాబితాలో ఉన్నారనే చెబుతారు. కానీ ఆ జాబితాలో ఒక్క సీఎం మాత్రం ఉండరు అతనే.. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ (69). ఈయన దేశంలోని అత్యంత నిరుపేద సీఎంగా కొనసాగుతున్నారు. 


త్రిపురలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా? నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన ఆస్తిని రూ.1,520గా చూపారు. 2013 ఎన్నికల సమయంలో ఆయన బ్యాంకు ఖాతాలో రూ.9,720గా చూపారు. 1998 నుండి త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్‌ వరుసగా ఎన్నికైతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 


ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నందుకు మాణిక్ సర్కార్‌కు వచ్చే జీతం రూ.26,315. కానీ సర్కార్ ఈ మొత్తాన్ని పార్టీ ఫండ్ కి విరాళంగా ఇస్తున్నారు. ఇందుకుగానూ పార్టీ ఆయనకు నెలకు రూ.9,700 ఇస్తుంది. అఫిడవిట్ లో అగర్తలాలో 0.0018 ఎకరాల భూమి తనపేరున ఉందని తెలిపారు. మాణిక్ మొబైల్ ఫోన్ ఉపయోగించరు. ఈ మెయిల్ కూడా లేదు. భర్త అంతటి హోదాలో ఉన్నపటికీ ఆయన భార్య ఆటోరిక్షాలోనే ప్రయాణిస్తుంది.  ఆమె టీచర్ గా పనిచేసి.. రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులే వారికి పెద్ద ఆస్తి.