భారత కొత్త సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా
భారతదేశానికి కొత్త సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా ఎంపికయ్యారు. సీనియర్ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించిన మెహతా ప్రస్తుతం అడిషనల్ సొలిసిటర్ జనరల్ హోదాలో సేవలందిస్తున్నారు.
భారతదేశానికి కొత్త సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా ఎంపికయ్యారు. సీనియర్ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించిన మెహతా అడిషనల్ సొలిసిటర్ జనరల్ హోదాలో నిన్నటి వరకూ సేవలందించారు. తాజాగా సొలిసిటర్ జనరల్ పదవి చేపట్టిన ఆయన జూన్ 30, 2020 తేది వరకు ఆ పదవిలో ఉంటారు. అక్టోబరు 20, 2017 తేది నుండి ఈ పదవి ఖాళీగా ఉంది. అంతకు ముందు రంజిత్ కుమార్ ఈ పదవిలో ఉండేవారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాం మొదలైన కేసులను వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా మెహతా గుర్తింపు పొందారు.
భారత ప్రభుత్వం తరఫున న్యాయసలహాదారులుగా వ్యవహరించే వ్యక్తులకు సంబంధించి సొలిసిటర్ జనరల్ పదవి అనేది దేశంలోనే రెండవ అతి పెద్ద ర్యాంకు. 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన కాలం నుండి ఇప్పటి వరకు మెహతా అడిషనల్ సొలిసిటర్ జనరల్ పదవిలో ఉండడం గమనార్హం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (సెక్షన్ 66ఏ) కేసును కూడా కేంద్రం తరఫున మెహతా వాదించి వార్తల్లో నిలిచారు.
తుషార్ మెహతా కంటే ముందు రంజిత్ కుమార్, మోహన్ పరాశరన్, రోహింటన్ నారిమన్, గోపాల్ సుబ్రహ్మణ్యం, జీఈ వాహనవతి, కిరిత్ రావల్, హరీష్ సాల్వే, నిట్టే సంతోష్ హెగ్డే మొదలైన వారు సొలిసిటర్ జనరల్ పదవుల్లో భారత ప్రభుత్వానికి సేవలందించారు. భారతదేశానికి తొలి సొలిసిటర్ జనరల్‌గా 28 జనవరి 1950న సీకే దఫ్తారీ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక.. మన్మోహన్ సింగ్ ప్రధానిమంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా నలుగురు సొలిసిటర్ జనరల్స్ మారారు.