ఇద్దరు పాక్ సైనికులను హతమార్చిన భారత ఆర్మీ
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భీంబర్ గాలి సెక్టార్ వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. భారత భద్రతాదళాలు ఇద్దరు పాకిస్తానీ సైనికులను చంపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నివేదికలు తెలిపాయి. ఇద్దరు పాకిస్తానీ సైనికుల చనిపోయినట్లు ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు. మోర్టార్లు, పేలుడు పదార్థాలతో పాక్ బలగాలు దాడులకు పాల్పడుతున్నారని సమాచారం.
అంతకుముందు బాందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు గుర్తించి హతమార్చారు. రెండు రోజుల క్రితం ఇదే హజిన్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది మృతదేహాన్ని భద్రతాసిబ్బంది గుర్తించారు.
బుధవారం, పుల్వామా జిల్లాలో ఒక పౌరుడిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. బాధితుడు అజాజ్ అహ్మద్ షాగా గుర్తించబడ్డాడు. అలానే ఫిబ్రవరి 26న ఉగ్రవాదులు ఇదే జిల్లాలోని పోలీసు స్టేషన్ వద్ద ఒక గ్రెనేడ్ ను విసరేయగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
బుద్గం జిల్లాలోని చార్సార్-ఎ-షరీఫ్ మందిరం సమీపంలో భద్రతా గార్డ్ శిబిరంపై తీవ్రవాదులు దాడి చేసిన ఘటనలో భద్రతా సిబ్బంది చనిపోయాడు. ఇతన్ని జమ్మూ-కాశ్మీర్ సాయుధ పోలీస్ 13వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ కుల్లేర్ సింగ్గా గుర్తించారు.