యూఏఈ పరాయి దేశం కాదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ పునర్నిర్మాణంలో ఎందరో ఇండియన్స్, ముఖ్యంగా అనేకమంది కేరళ వాసులు కష్టపడి పనిచేశారని ఆయన అన్నారు. పైగా ఆ దేశం తమ ప్రభుత్వం తరఫున కేరళ వరద బాధితులకు విరాళాలు ఇచ్చే విధంగా ప్రతిపాదన చేసిందని ఆయన అన్నారు. ప్రకృతి ప్రళయానికి అతలాకుతలమైన కేరళ బాధితుల కోసం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లను సహాయంగా అందిస్తున్నట్లు ప్రకటించగా.. ఆ విరాళాన్ని భారత్  ప్రభుత్వం సున్నితంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సహాయం క్రింద కేరళకు రూ.600 కోట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దాదాపు  రూ.20,000 కోట్ల మేరకు కేరళకు నష్టం జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దాదాపు 12 లక్షలమంది ప్రజలు ఇప్పటికే కేరళలో వివిధ ప్రాంతాల్లో సహాయక కేంద్రాలలో తల దాచుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు 370 మంది కేరళ పౌరులు ఈ విపత్తులో మరణించారు. 


అబుదబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి.. తాము రూ.700 కోట్లను కేరళ బాధితులకు అందజేయాలని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనను భారత ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. డిసెంబరు 2004లో భారత ప్రభుత్వం స్వయంగా ప్రతిపాదించుకున్న డిజాస్టర్ ఎయిడ్ పాలసీకి అనుగుణంగానే తాము దేశంలో విపత్తులు సంభవించినప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం స్వయంగా ఏ ఇతర దేశం నుండి కూడా విరాళాలను తీసుకోవడం జరగదు. అయితే ప్రధాని ఆ సహాయాన్ని నిరాకరించకుండా ఉండాల్సిందని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ తెలిపారు.