అయోధ్య: రామ జన్మ భూమి అయోధ్యలో శ్రీరాముడి మందిరం నిర్మాణంపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలనే డిమాండ్‌‌తో విశ్వహిందూ పరిషత్ ఆదివారం అయోధ్యలో భారీ ఎత్తున ధర్మ సభను నిర్వహించనుంది. ఈ సభకు దేశం నలుమూలల నుంచి సుమారు మూడు లక్షల మంది రామ భక్తులు హాజరవుతారని వీహెచ్‌పీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే సైతం నిన్ననే అయోధ్యకు చేరుకున్నారు. నిన్న సరయు నది ఒడ్డున హారతి ఇచ్చిన ఆయన ఇవాళ రామ మందిరం నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌తో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. శివసేన, వీహెచ్‌పీ వేర్వేరుగా నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది రామ భక్తులు, ఆయా సముదాయాల మద్దతుదారులు ఇప్పటికే అయోధ్య చేరుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగపూర్, పూణె, ముంబై వంటి ప్రాంతాలతోపాటు మహారాష్ట్రలోని పలు ఇతర ప్రాంతాల నుంచి ఐదు ప్రత్యేక రైళ్లలో తరలివచ్చిన వేలాది మంది శివసేన కార్యకర్తలు జైశ్రీరాం నినాదాలతో అయోధ్యను హోరెత్తించారు. భారీ సంఖ్యలో కార్యకర్తల మధ్య ఇవాళ ఉదయం ఉద్ధవ్‌ థాక్రె రామ మందిరం స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన థాక్రె.. బీజేపీ సర్కార్ రామాలయ నిర్మాణం ప్రారంభించడానికి ఒక తేదీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 


ఇదిలావుంటే, మరోవైపు అయోధ్య ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ 144 సెక్షన్ విధించింది. కర్ఫ్యూ వాతావరణం మధ్యలోనే శివసేన, వీహెచ్‌పీ పోటాపోటీగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు, భారీ సభలతో అయోధ్యలో హై టెన్షన్ నెలకొంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందా అని స్థానికులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయోధ్యలో కనిపిస్తోంది.