న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుపై ఈశాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని, ఈ బిల్లుపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ప్రహ్లాద్ జోషి అన్నారు. బిల్లు ఆమోదం విషయంలో తీవ్ర అసహనంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తన అసంతృప్తిని ఈశాన్య ప్రజలపై రుద్దడం సరికాదన్నారు. బీజేపి పార్లమెంట్ సభ్యురాలు రూపా గంగూలీ మాట్లాడుతూ.. ఒకప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న దినాజ్‌పూర్‌నుంచి వెళ్లొచ్చినప్పుడు తానే స్వయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. భారత్‌కి వచ్చాకే తన కుటుంబానికి ఇక్కడి పౌరసత్వం, పాస్‌పోర్ట్ లభించాయని ఆమె అన్నారు. అయితే, తనలాగే న్యాయం కోసం ఎదురుచూస్తోన్న వాళ్లు ఎంతో మంది ఉన్నారని.. వాళ్లందరికీ  న్యాయం దక్కాల్సి ఉంది కదా అని ఆమె అభిప్రాయపడ్డారు.


అస్సాంలోని పది జిల్లాలు లాఖిమ్పూర్, తిన్సుకియా, దేమజి, చరయ్డియో, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్, కమృప్, డిబ్రుఘడ్‌లలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. బుధవారం రాజ్యసభలో పౌర సత్వ సవరణ చట్టం బిల్లు ఆమోదం పొందగా, ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 మద్దతు తెలుపగా 105 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన తరవాత అస్సాంలో డిబ్రుఘడ్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించారు.