ఉత్తరప్రదేశ్ లోక్సభ ఉప ఎన్నిక, బీహార్ లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి రెండు గంటల ఓట్ల లెక్కింపు ఆధారంగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రాష్ట్రాల్లో ఐదు సీట్లుకు గానూ మూడు స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో బీజేపీ, బీహార్ లోని అరారియా, భాబువాలలో బీజేపీ ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని ఫుల్పూర్ స్థానంలో సమాజ్వాది పార్టీ (ఎస్పీ) ఆధిక్యంలో ఉంది. బీహార్ లోని జెహానాబాద్ లో ఆర్జేడీ ఆధిక్యత సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్, ఫుల్పూర్ రెండూ కూడా బీజేపీ స్థానాలే. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోటగా ఉండగా, ఫుల్పూర్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కంచు కోటగా ఉంది. గోరఖ్పూర్ లోక్సభ స్థానానికి ఉపేంద్ర శుక్లా 3 వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మరోవైపు, ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర పటేల్ ఫుల్పూర్ లో 2,400 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు.


బీహార్ లోని అరారియా లోక్సభ స్థానంలో ఆర్జేడీ మొదట ఆధిక్యంలో ఉండగా.. 10:30 గంటల సమయంలో బీజేపీ వేగం పుంజుకొని 4,000 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్ అరారియా లోక్సభ స్థానంలో 4,203 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. జెహనాబాద్ లో ఆర్జేడీ ముందజలో ఉంది. భాబువా అసెంబ్లీ స్థానంలో బీజీపీ 2,793 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉంది.