గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ పార్టీపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. తాను ముందే చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు బీజేపీకి లాభించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ ఎన్నికైన నేపథ్యంలో.. తాజా ఎన్నికల ఫలితాలను ముడిపెడుతూ ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. 2019లో జరిగే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికలలో ఈ ఫలితాలే మళ్లీ పునరావృతం అవుతాయని, బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. 


కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలే.. ఆ పార్టీని ఓటమికి ప్రధాన కారణమని యోగీ అభిప్రాయపడ్డారు. 'ప్రధాని మోదీ సంస్కరణలే బీజేపీ విజయానికి కారణమయ్యాయి. ఆయన నేతృత్వంలోనే దేశం ఆర్ధిక సుస్థిరత సాధించింది. ఈ ఎన్నికలను చూసైనా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలి" అని అన్నారు. యూపీ ప్రజల తరుఫున యోగీ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు శుభాకాంక్షలు తెలిపారు.