25 వేల హోంగార్డుల ఉద్యోగాలు హుష్కాకి
25 వేల హోంగార్డుల ఉద్యోగాలు హుష్కాకి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25 వేల మంది హోంగార్డులను ఉద్యోగాల నుంచి తొలగించి వారికి ఊహించని షాక్ ఇచ్చింది. అంతేకాకుండా మరో 99,000 మంది హోంగార్డుల పనిదినాలను 25 రోజుల నుంచి 15 రోజులకు కుచించింది. ఫలితంగా ఉద్యోగం కోల్పోకుండా ఉన్న హోంగార్డులకు సైతం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం లభించే పరిస్థితి లేదు. దీంతో వారికి అందే వేతనం కూడా తగ్గిపోనుంది. బడ్జెట్‌లో లోటుపాట్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్కార్ వెల్లడించింది. దీపావళి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేక విమర్శలకు తావిచ్చింది.
పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల్లోని వివరాల ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంగార్డుల తొలగింపుపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారా అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.