భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు దేశాల పర్యటన కోసం ఇవాళ ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. సెర్బియా, మాల్టా, రొమేనియా దేశాల్లో వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. ఏడు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా మొదట సెర్బియా చేరుకోనున్న వెంకయ్య నాయుడు అక్కడ ఆ దేశ అధినేతలతో భేటీ కానున్నారు. ఈ మూడు దేశాల పర్యటనలో వ్యవసాయం, పర్యాటక రంగాల్లో పలు కీలక ఒప్పందాలపై వెంకయ్య నాయుడు సంతకం చేయనున్నారని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి డా. అంజు కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 


ఆదివారం మాల్టా చేరుకోనున్నా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్కడ ఆ దేశ అధినేతలతో సమావేశం కానున్నారు. మాల్టాకు భారత్‌లో ఉన్న ఐటీ కంపెనీలు సేవలు అందించేందుకు అనేక అవకాశాలు ఉన్నందున ఆ దిశగా ఆ దేశాధినేతలతో ఉప రాష్ట్రపతి చర్చలు జరుపుతారని డా.అంజు కుమార్ పేర్కొన్నారు. చివరిగా ఈ నెల 18న వెంకయ్య నాయుడు రొమేనియా చేరుకోనున్నారు. భారత్‌తో చారిత్రక సంబంధాలున్న ఈ మూడు యూరప్ దేశాల పర్యటనలో వెంకయ్య నాయుడు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటన స్పష్టంచేసింది. ఇదిలావుంటే, మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.