హతమైన ఉగ్రవాదులను చచ్చిన దోమలతో పోల్చుతూ ప్రతిపక్షాలకు వికె సింగ్ చురకలు
చచ్చిన దోమలను లెక్కబెట్టాలా ? ప్రతిపక్షాలకు వీకే సింగ్ చురకలు
ఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ వద్ద వున్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన జరిపిన దాడిలో ఎంత మంది చనిపోయారన్న వివాదంపై ఇండియన్ ఆర్మీ మాజీ అధిపతి, కేంద్ర మంత్రి వీకే.సింగ్ ప్రతిపక్షాలపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టడాన్ని దోమల్ని చంపడంతో పోల్చుతూ.. ట్విటర్ ద్వారా ప్రతిపక్షాలకు చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ''నిన్న రాత్రి 3.30గంటల సమయంలో నా గదిలోకి చొరబడిన దోమలను హిట్ కొట్టి చంపేశానని, ఆ తర్వాత నేను నిద్రపోవాలా లేక చచ్చిన దోమల్ని లెక్కపెట్టుకుంటూ కూర్చోవాలా'' అంటూ వికే సింగ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన వైమానిక దాడిలో 300 నుంచి 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి వుంటారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారనే కచ్చితమైన సంఖ్యను వెల్లడించడంతోపాటు అందుకు తగిన ఆధారాలు వెల్లడించాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ.
ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ''దాడులు జరిగిన చోట 300 సెల్ ఫోన్స్ యాక్టివ్‌లో వున్నట్టు తేలిందని, ఆ మొబైల్ ఫోన్లను ఉగ్రవాదులు కాకపోతే చెట్లు ఉపయోగించినట్టా'' అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.