టెలికాం రంగంలో పెరిగిపోతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు టెలికాం ఆపరేటర్లు ఎప్పటికప్పుడు తమ ప్రత్యర్థులకన్నా మెరుగైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా వొడాఫోన్ ఓ సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ప్లాన్ టారిఫ్ ప్రకారం రూ.159 ప్రీపెయిడ్ రీచార్జ్‌తో 28 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), రోజూ 1జీబీ డేటా (4G/3G), 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 28 రోజులపాటు అపరిమితమైన కాలింగ్ సదుపాయం కలిగిన ఈ టారిఫ్‌లో వొడాఫోన్ ఓ చిన్న షరతు విధించింది. రూ.159 ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే వారానికి 1000 నిమిషాల వరకు వాయిస్ కాలింగ్ పరిమితి విధించింది. 


వొడాఫోన్ ప్రవేశపెట్టిన ఈ రూ.159 టారిఫ్ ని పరిశీలిస్తే, రిలయన్స్ జియో అందిస్తోన్న రూ.149 టారిఫ్ ప్లాన్‌‌కు పోటీగానే వొడాఫోన్ ఈ కొత్త టారిఫ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిందని అర్థమవుతోందంటున్నారు టెలికాం రంగంలోని మార్కెట్ విశ్లేషకులు. జూన్ నెలలో రిలయన్స్ జియోకు మారిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య చాలా అధికంగా ఉండటం మిగతా టెలికాం ఆపరేటర్లను ఆందోళనకు గురిచేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే, వొడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ని తీసుకురావడమే అందుకు నిదర్శనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.