పన్ను ఎగవేతదారుల కట్టడికై ఐటీశాఖ కొత్తగా ఇన్‌కం టాక్స్ ఇన్ఫార్మర్ పథకాన్ని తీసుకొచ్చింది. దేశంలో రూ.5 కోట్లు లేదా అంతకు మించి పన్ను ఎగవేతదారులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ.5 లక్షలు మొదలు రూ.5 కోట్ల వరకు నజరానా ఇవ్వనుంది. వ్యక్తుల వివరాలు రహస్యంగా ఉంచుతూ నగదును బ్యాంకు ఖాతాకు దశలవారీగా అందించనుంది. దీనిపై పూర్తి వివరాలకు ఐటీ శాఖ అధికార వెబ్‌సైట్ చూడండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్కీమ్‌ను ఏప్రిల్ 23, 2018న ప్రవేశపెట్టగా.. ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ జూన్ నెలలో సవరించింది. భారతీయులు, విదేశీయులు ఈ పథకం కిందకు వస్తారని కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 1 న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రభుత్వోద్యోగులను ఇందులో నుంచి మినహాయించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌ విభాగంలో పేర్కొన్న ప్రకారం వివరాలు చెప్పవలసి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.  


ఇన్‌కం టాక్స్ ఇన్ఫార్మర్ పథకం కింద బహుమతిని పొందేందుకు, పాల్గొనే వ్యక్తి వ్రాతపూర్వకంగా పన్ను ఎగవేతదారుల సమాచారాన్ని అందివ్వాలి. సమాచారం ఇచ్చాక అతడు/ఆమెకు కోడ్‌ను అధికారులు ఇస్తారు. అధికారులు ఏ ఇతర పద్ధతుల్లోనూ అనగా ఉదాహరణకు ఈమెయిల్, సీడీ, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఫేస్‌బుక్  లేదా ఇతర సామాజిక మాధ్యామాల్లో ఇచ్చే సమాచారాన్ని అంగీకరించరు.


ఇన్‌కం ట్యాక్స్ డైరెక్టర్ జనరల్(ఇన్వెస్టిగేషన్), ఇన్‌కం ట్యాక్స్ జాయింట్ డైరెక్టర్(ఇన్వెస్టిగేషన్) లేదా ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ (ఇన్వెస్టిగేషన్)లను ఇతర వివరాలకు సంప్రదించవచ్చు. ఐటీ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం, తప్పుడు సమాచారం/ సాక్ష్యం/ ప్రకటన ఇవ్వడం నేరం. అందుకు ఆ వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.