2019లో పార్లమెంటుకు జరుగనున్న సాధారణ ఎన్నికల్లో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తమ తమ నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతారని భాజపా పార్టీ వ్యాఖ్యానించింది. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజక వర్గంలో ఓటమిపాలవుతారని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా భాజాపా పైవిధంగా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ నేతలిద్దరి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని భాజాపా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ భవితవ్యం గురించి రాహుల్‌ గాంధీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 2019 ఎన్నికల్లో తమ భవితవ్యంపై రాహుల్‌ దృష్టి సారించాలని భాజాపా అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ అన్నారు. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో వారిద్దరూ గెలవలేరని, తమ నియోజకవర్గాలకు రాహుల్‌, సోనియాలు చేసిందేమీలేదని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నేడు ఉన్న పరిస్థితుల దృష్య్టా.. రాహుల్ గాంధీ, అతని తల్లి సోనియా గాంధీ అమేథీ, రాయ్‌బరేలీ సీట్లలో ఓడిపోతారు. తమ నియోజకవర్గాల్లో వాళ్లు చేసిందేమీ లేదు. అక్కడి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది." అని  అనిల్ బలూనీ అన్నారు.


ఆదివారం యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిస్తే బీజేపీతో పాటు మోదీ కూడా వారణాసిలో ఓడిపోవడం ఖాయమని రాహుల్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా పతనం అవుతుందని..చాలా ఏళ్లుగా చూడని ప్రభుత్వ పతనాన్ని ఈసారి చూస్తారని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు కర్ణాటక నుంచే మొదలవుతాయని, అన్ని రాష్ట్రాల్లో ఇదే గాలి వీస్తుందని రాహుల్‌ చెప్పారు.