ఢిల్లీ ప్రజలు AAPకే పట్టం కడతారు: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
గత ఐదేళ్ల పాలనలో ప్రజలకోసం ఆమ్ ఆద్మీ పార్టీ చాలా శ్రమించిందని, ప్రజల ఆశీర్వాదం తమకే లభిస్తుందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. విమర్శ, ప్రతివిమర్శలు చేసుకున్నాయి. నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కీలక ఘట్టం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫిబ్రవరి 8న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆప్‌కే పట్టం కడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం తమదే అధికారమని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. అయితే గత ఐదేళ్ల పాలనకే ప్రజలు పట్టం కడతారని ఆప్ నేతలు, మంత్రులు చెబుతున్నారు.
Also Read: బీజేపీ 55 సీట్లు నెగ్గుతుంది!: మనోజ్ తివారీ
ఓట్ల లెక్కింపు రోజు ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ప్రజల కోసం గత 5 సంవత్సరాలు తాము పనిచేశామని, ప్రజల ఆశీర్వాదం తమకే ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తాము మరోసారి అధికారం చేపట్టనున్నట్లు వ్యాఖ్యానించారు.
ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, తమ పాలన తీరు చూసి ఢిల్లీ ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. అక్షర్‌ధామ్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఓట్ల లెక్కింపును పరిశీలించారు. బీజేపీ రవి నేగి కూడా ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు.