అట్టుడికిన పశ్చిమ బెంగాల్: చివరి విడత పోలింగ్‌లోనూ చెలరేగిన హింస
అట్టుడికిన పశ్చిమ బెంగాల్: చివరి విడత పోలింగ్‌లోనూ చెలరేగిన హింస
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత పోలింగ్‌లోనూ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపి కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పర ఆరోపణలతో ఘర్షణకు దిగారు. ముఖ్యంగా జాదవ్‌పూర్‌లోని 150/137 పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసి పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు ముఖాలు కనిపించకుండా ముఖాన్ని కవర్ చేసుకుని వచ్చి గైర్జాజరైన ఓటర్ల ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపి ఎంపి అనుపమ్ హజ్రా నిరసనకు దిగారు. ఇదేంటని ప్రశ్నించినందుకు గొడవకు దిగారని అనుపమ్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదిలావుంటే, మరోవైపు టీఎంసీ అభ్యర్థులు, నేతలు కేంద్ర బలగాలపై సైతం విమర్శలకు దిగారు. టీఎంసి మద్దతుదారులపై కేంద్ర బలగాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆ పార్టీ అభ్యర్థి కకోలి ఘోష్ దస్తిదర్ ఆరోపించారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్ సైతం హింసాత్మకమే అవడం గమనార్హం.