Budget అంటే ఏమిటి.. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు?
Union Budget 2020 | దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం దగ్గరకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
నెల చివరికి వచ్చేసరికి ప్రతి ఇంట్లోనూ వచ్చే నెల ఆదాయం ఎంత వస్తుంది, ఏమేరకు ఖర్చవుతుందని లెక్కలు వేసుకుంటారు. అదే విధంగా ప్రభుత్వాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఎంత ఆదాయం రానుంది, ఏమేరకు ఖర్చులుంటాయి.. వాటిని శాఖలవారీగా లెక్కలు వేసుకోవడాన్ని బడ్జెట్ అంటారు. ఆదాయ, వ్యయాలను ముందుగానే అంచనా వేసుకోవడాన్ని సింపుల్‌గా బడ్జెట్ అంటారు. మన దేశంలో ప్రతి ఏడాది బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఈ బడ్జెట్‌ను ఆవిష్కరిస్తారు. గతంలో ఫిబ్రవరి నెల చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 తేదీల మధ్య ఆ బడ్జెట్ వర్తిస్తుంది. నూతన బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలు, పన్నులో వ్యత్యాసాలు వంటివి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతాయి. భారత్‌లో తొలి బడ్జెట్‌ను ఆర్.కె.షణ్ముఖం చెట్టీ 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ఆవశ్యకథ
చిన్న ఇల్లు అయినా ఆదాయం, ఖర్చులు లెక్కలు చూసుకుంటారు కదా. అదేవిధంగా ఓ రాష్ట్రం, లేక దేశంలో ఉన్న మొత్తం ప్రజల ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగాలంటే బడ్జెట్ కచ్చితంగా అవసరం. బడ్జెట్ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖలకు నిధుల కేటాయింపులతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశం ఉంది. ఓసారి బడ్జెట్‌లో అంచనాలు తప్పితే వచ్చే ఏడాది ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడవచ్చు. మెరుగ్గా ఆర్థిక అంశాలను చక్కదిద్దుకోవచ్చు.
ముఖ్యమైన అంశమేంటంటే.. బడ్జెట్‌కు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించకపోతే.. ఖజానాలో ఉన్న డబ్బును కేంద్ర ప్రభుత్వం వినియోంచడం అంత తేలిక కాదు. అయితే ప్రతి రూపాయి ఖర్చుకి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వాలు కచ్చితంగా బడ్జెట్ ఆమోదం పొందేలా జాగ్రత్త పడతారు.