భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రేడియో షో "మన్ కీ బాత్"లో పాల్గొని దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. భారత శాంతి దళాల ఏర్పాటు, సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం లాంటి విషయాల గురించి మాట్లాడిన మోడీ పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ప్రస్తావించారు. ఈ మన్ కీ బాత్ వేదికపై అక్టోబరు 31వ తేదీన దేశవ్యాప్తంగా జరగబోయే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రస్తావిస్తూ, దేశ సమైక్యతను కోసం ఆ మహనీయుడు వేసిన బాటకు గుర్తుంచుకోవడానికే, నేడు రాజ్యమంతా ఆ రోజును "రాష్ట్రీయ ఏకతా దివస్"గా జరుపుకుంటుందని తెలిపారు. వెంటనే అదే రోజు మాజీ భారత ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్థంతి అని కూడా పేర్కొన్నారు. అయితే ఆ విషయంపై ఆయన ఎక్కువ సేపు మాట్లాడలేదు.


సర్దార్ పటేల్ నమ్మిన సిద్ధాంతాలు నేటి యువ భారతానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని తెలియజేస్తూ, పటేల్ కఠినమైన సమస్యలను కూడా ఎంత ప్రాక్టికల్‌గా పరిష్కరించవచ్చో తెలిపిన మేధావి అని అభిప్రాయపడ్దారు. అలాగే నవంబరు 4వ తేదీన జరుపుకోబోయే గురునానక్ జయంతిని కూడా మోడీ ప్రస్తావించారు. గురు నానక్ దాదాపు 28 వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వెళ్లి ప్రజలకు శాంతి సందేశం అందించారని, మానవత్వమే అన్నింటకన్నా మిన్న అని చాటారని తెలిపారు. దేశ ప్రజలకు సత్యం, త్యాగం, నిబద్ధత మరియు ఐక్యత మొదలైన విషయాల గురించి బోధించారని కొనియాడారు. అలాగే 28 అక్టోబరు తేదీన సిస్టర్ నివేదిత 150వ జయంతోత్సవమని.. ఆమె బడుగు బలహీనవర్గాలకు చేసిన సేవ మరిచిపోలేనిదని మోడీ ఈ సందర్భంగా ఉటంకించారు.