భగత్ సింగ్.. భరతమాత ముద్దుబిడ్డ. బ్రిటీష్ వారి అరాచకాలకు ఎదురు తిరిగి పోరాడడమే కాకుండా.. విప్లవబాటతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన యువకుడు. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌ని పోలీసులు హతమార్చాక.. ఆ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్‌తో పాటు ఇతర విప్లవకారులు కారకులపై పగ తీర్చుకోవాలని భావించారు. అందులో భాగంగానే పథకం ప్రకారం ఆ ఘటనకు కారణమైన బ్రిటీష్ పోలీస్ అధికారి స్కాట్‌ను చంపాలని వారు భావించారు. కానీ.. తాము చేసిన దాడిలో శాండర్స్ అనే అధికారి మరణించాడు. ఈ హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై బ్రిటీష్ ప్రభుత్వం అభియోగాలు మోపింది. అలాగే కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగిన ఘటనలో కూడా భగత్ సింగ్ మొదలైన వారిని కోర్టు దోషులుగా పేర్కొంది. వారిని జైలులో పెట్టింది. జైలులో ఖైదీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా బ్రిటీష్ పాలకులు చిత్రహింసలు పెట్టారు. ఈ క్రమంలో ఖైదీల హక్కులకై పోరాడుతూ భగత్ సింగ్.. జైలులోనే నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టాడు. బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్‌తో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు ఉరిశిక్ష విధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భగత్ సింగ్‌కు ఉరిశిక్ష పడ్డప్పుడు.. ఆయన స్నేహితుడు ప్రన్నత్ మెహతా క్షమాభిక్ష ముసాయిదా లేఖ తీసుకొని వచ్చి తన మిత్రుడిని కలిశాడు. ఆ లేఖపై సంతకం చేయమని కోరాడు. అప్పుడు భగత్ సింగ్ సంతకం చేయడానికి నిరాకరిస్తూ చెప్పిన మాటలు ఇవి. అంతకు ముందు ఆయన అవే మాటలు చాలాసార్లు చెప్పాడు. "వ్యక్తులను చంపడం సులభమైనప్పటికీ సిద్ధాంతాలను సమాధి చేయలేరు. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా.. సిద్ధాంతాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి, ఉంటాయి, ఉండబోతాయి కూడా" అన్నాడు.


"జీవిత లక్ష్యమంటే....మనస్సును నియంత్రించడం కాదు. భవిష్యత్తులో మోక్షం పొందడం కాదు. మనం చేయాలని అనుకున్నది ఏదైనా ఇప్పుడే చేయాలి. సామాజిక పురోగతి అనేది ఏ కొందరి ప్రతిష్టలపైనో ఆధారపడి ఉండదు. ప్రజాస్వామ్య ప్రగతిపైనే ఏ పురోగతైనా ఆధారపడి ఉంటుంది"  అని కూడా భగత్ సింగ్ ఓ సందర్భంలో అన్నాడు. భగత్ సింగ్ మరణం తర్వాత.. అదే ఘటన భారత స్వాతంత్ర్యోద్యమ కొనసాగింపుకు సహాయపడేలా వేలాది మంది యువకుల్లో ఎంతలా స్ఫూర్తిని నింపిందో మనకు తెలిసిన విషయమే.