నిన్న సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు మెకానికల్ ఇంజనీర్లు కాకుండా సివిల్ ఇంజనీర్లు మాత్రమే దరఖాస్తు చేయాలని, ప్రాజెక్టుల అనుభవం ఉండడం వల్ల వారే ఈ పోస్టులకు మరింత అర్హులని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారతదేశ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఆశ పడకూడదని.. కిల్లీ బడ్డీలు పెట్టుకోవడం గానీ, పాలు అమ్మడం గానీ చేయాలని అన్నారు. ఆ పనులు కూడా ఎంట్రప్రెన్యూర్‌షిప్ క్రిందకే వస్తాయని పేర్కొన్నారు.


ఒకవేళ అలా చేసి ఉంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగుల వద్ద కనీసం రూ.10 లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలా స్వయం ఉపాధి ద్వారా డబ్బు సంపాదించాలనుకొనే వారికి బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయని.. కానీ యువతే వాటిని ఉపయోగించుకోవడం లేదన్నారు. నేడు గ్రాడ్యుయేట్లు వ్యవసాయం చేయడాన్ని లేదా పౌల్ట్రీలు నడపడాన్ని తక్కువస్థాయి కెరీర్లుగా చూస్తున్నారని.. అలా ఆలోచించడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని బిప్లవ్ దేవ్ అన్నారు.