రాజీనామాకు ముందు ఉద్వేగానికి గురైన బీఎస్ యడ్యూరప్ప
బల పరీక్షకు ముందే శాసన సభను ఉద్దేశించి ప్రసంగించిన యడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్షకు ముందే తమ భారతీయ జనతా పార్టీకి తగినంత మెజార్టీ లేదని అంగీకరించిన బీఎస్ యడ్యూరప్ప.. జనం తమకు ఇంకొన్ని స్థానాల్లో విజయం కట్టబెట్టి వుంటే పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండి ఉండేది అని చెబుతూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. బల పరీక్షకు ముందే శాసన సభను ఉద్దేశించి ప్రసంగించిన యడ్యూరప్ప.. జనం 104 స్థానాలకు బదులుగా 113 స్థానాల్లో బీజేపీని గెలిపించి వుండుంటే, తాము ఈ రాష్ట్రాన్ని స్వర్గసీమగా తీర్చిదిద్ది వుండే వాళ్లం అని అన్నారు. తాను అధికారంలో వున్నా లేకపోయినా.. జనం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తాను పోరాడుతూనే వుంటానన్న ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 28 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తంచేశారు.
సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నంతసేపు యడ్యూరప్ప ముఖంలో ఉద్వేగం స్పష్టంగా కనిపించింది. ప్రసంగం చివర్లో 'ఇక తాను రాజ్ భవన్‌కి వెళ్లి తన రాజీనామా సమర్పిస్తాను' అని చెబుతూ యడ్యూరప్ప తన ప్రసంగాన్ని ముగించారు.