ఎన్డీయేని ఇరుకున పెట్టాలని భావించిన చంద్రబాబు సర్కారు... అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ తమ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు అవిశ్వాసం నోటీసులు ఇవ్వాల్సిందేనని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ ఫ్లోర్ లీడర్ తోట నరసింహన్ లోక్ సభ స్పీకరుకు నోటీసులు జారీ చేశాక.. ఇదే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనేకమంది అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి లాంటి వ్యక్తులు కూడా అవిశ్వాసం పెట్టడం అనేది ఏపీ రాజకీయాల్లో మంచి సంఘటనగా అభివర్ణించారు. బీజేపీ వ్యతిరేక పార్టీ అధినేతలు తెలుగుదేశం పెట్టే అవిశ్వాసానికి మద్దతిస్తాయని ఆయన తెలిపారు. అలాగే చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తే.. అవిశ్వాసంపై చర్చ కచ్చితంగా సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు



ఇదే క్రమంలో భిన్నవాదనలు కూడా తెరమీదికొచ్చాయి. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని సీపీఎం నేతలు తెలపడం గమనార్హం. అలాగే టీడీపీ పెట్టే అవిశ్వాసానికి తమకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీలు మందుకొచ్చాయి.  మరోవైపు అకాలీదళ్‌ కూడా పాజిటివ్ ధోరణి కనబరుస్తోంది.  టీఎంసీ నేత దినేశ్‌ త్రివేదీ కూడా టీడీపీ తీరు పట్ల సుముఖతనే వ్యక్తం చేశారు. 


ఈ క్రమంలో కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అన్న అంశంపై జీ న్యూస్ తెలుగు విభాగం ఓ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో పాల్గొన్న 69% తెలుగు రాష్ట్రాల ప్రజలు అవిశ్వాసం పెడితేనే మంచితని భావించినట్లు తెలుస్తోంది. అలాగే 31% ప్రజలు అవిశ్వాసం పెట్టకపోతే మంచిదని తేల్చారు.