చిలుకూరు వీసా బాలాజీ టెంపుల్ ప్రత్యేకతలు
చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ నగర శివార్లలో ఉంది. గుడి పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది.
చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ నగర శివార్లలో ఉంది. గుడి పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ మ్రొక్కుగా ప్రదక్షిణాలు చేస్తే వీసా తొందరగా వస్తుందని నమ్మకం. అందుకే ఇక్కడ వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని 'వీసా బాలాజీ' అని పిలుస్తారు.
పురాణ కథనం
ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి ఏడాది తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవాడు. కానీ అనారోగ్యకారణంగా ఆయన తిరుపతికి వెళ్లలేకపోతాడు. అందుకు చింతిస్తున్న ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీ సమీపంలోని అరణ్యంలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించగా.. పుట్టనుండి శ్రీదేవీ భూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు.
ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించిగా.. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.
ఇక్కడి ప్రత్యేకత: దేవుడి విగ్రహాన్ని కళ్లు మూసుకోకుండా చూడాలి. మొదటిసారి భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తారు. మ్రొక్కు తీరాక 108 ప్రదక్షిణాలు చేస్తారు.
రవాణా వ్యవస్థ
హైదరాబాద్ లోని వివిధ బస్ స్టేషన్ల నుండి సిటీ బస్సులు చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు విరివిగా నడుస్తాయి. మెహదీపట్నం నుండి 288డి నెంబర్ బస్సు ఎక్కితే సులభంగా టెంపుల్ వద్దకు చేరుకోవచ్చు.