దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలా ఉన్నావు ? ప్రతీ ఒక్కరూ తమ బంధుమిత్రులని అడిగే ప్రశ్న ఇదే. అలాగే దాదాపు ప్రతీ ఒక్కరి నుంచీ వచ్చే సర్వసాధారణమైన జవాబు కూడా నేను చాలా బాగున్నాను అనే. ప్రశ్న ఎలాగైతే ఉంటుందో.. అందుకు ప్రతిగా వచ్చే సమాధానం కూడా అలాగే ఉంటుంది. ఇదంతా బయటివాళ్ల కోసమైతే అది వేరే విషయం కానీ అయినవాళ్లకు కూడా ఇలాంటి ప్రశ్నలే వేసి, అలాంటి జవాబులే చెబితే ఏం బాగుటుంది! చెప్పకుండానే అవతలి వాళ్ల మనసులో ఏం ఉందో తెలుసుకునే మెళకువలు ఇవాళేం కొత్తవి కాదు. ఒకప్పుడు కళ్లు చూస్తే చాలు, ఆ కళ్ల వెనుక దాగి ఉన్న భావాల్ని పసిగట్టేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఎవరైనా, ఏదైనా చెప్పకుండా అర్థం చేసుకునే వాళ్లు ఇప్పుడు ఎక్కడైనా ఉన్నారా ? 


చెప్పకుండానే ఎవరి మనసులో ఏం ఉందో చెప్పగలిగే శక్తితో చాలా ప్రయోజనాలే వుండేవి. ఎదుటి వాళ్లు ఏం చెప్పుకోకున్నా... వాళ్ల మనసుల్లో ఉన్న సంఘర్షణలు, బాధలను అలవోకగా అర్థం చేసుకునేవాళ్లు. ఎదుటివారిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడే మనం మన సరిహద్దుల్ని దాటుకుని అవతలి వాళ్లకు మరింత చేరువవగలుగుతాం. కానీ ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమలు తగ్గాయి, దూరాలు పెరిగాయి. ఒకరికొకరికి మధ్య ఎంత దూరం పెరిగిందంటే, మనం అంతా ఒక గ్రహంపైనే కలిసి బతుకుతున్నామా అని మనపై మనకే సందేహం వచ్చేంత దూరాలు పెగిరిపోయాయి. 


దూరంగా ఉండే మనుషుల మనసుల్లో ఏం ఉందో చెప్పడం కష్టమైతే కావచ్చు కానీ కళ్లెదుట ఉన్న వాళ్ల మనసుల్లో ఏముందనేది కూడా ఎందుకు చెప్పలేకపోతున్నామనేదే ఇప్పుడు మెదడుని తొలిచేస్తోన్న ప్రశ్న. పిల్లల మనసుల్లో ఏముందో పెద్దోళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. పెద్దల మనసుల్లో ఏముందనేది ఇంకో పెద్దోళ్లు అర్థం చేసుకోలేని పరిస్థితి. ఒకరితో ఒకరు కలిసుంటూ కూడా ఒకరి మనుసులో ఏముందో ఇంకొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. 


ఒకప్పుడు... స్మార్ట్ ఫోన్లు, ఫేస్‌బుక్ లాంటివేవీ లేని రోజుల్లో.. ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న తమ కన్న పిల్లలు ఏదో ఆపదలో ఉన్నారనే విషయాన్ని ఎవ్వరూ చెప్పకుండానే పసిగట్టగలిగేవాళ్లు వారి తల్లిదండ్రులు. అయితే, ఇప్పడు స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినా... ఒకరి కష్టాలు మరొకరు తెలుసుకునేందుకు తీరిక లేకుండా పోయింది. ఉండటానికి ఒకే చోట కలిసుంటున్నా.. ఎంతోమంది ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఒంటరిగా వుండి బాధపడటం కన్నా కూడా ఒకరి తోడు ఉండి కూడా మనశ్శాంతి లేకపోవడం కన్నా ఇబ్బందికరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఇదే నిజం అని అంగీకరించాల్సిందే. కాదని కొట్టిపారేయడానికి ఇదేం రాకెట్ సైన్స్ కూడా కాదు. 


వీటన్నింటికి మూలం మనిషి తమకి అయిన వారి కోసం కాకుండా అనవసరమైన వాటికోసం అధిక సమయాన్ని కేటాయించడమే. అయిన వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మానేసి ఫేస్‌బుక్‌లో పోస్టుల కింద లైక్‌ల కోసం తాపత్రయపడటం లాంటి వ్యర్థ కార్యకలాపాలకు సమయం కేటాయించడం వంటివన్నీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. పనికిమాలిన పనుల కోసం కేటాయించే సమయాన్నే మనల్ని ప్రేమించే వారికోసం, మనల్ని ఇష్టపడే వారికోసం కేటాయించినట్టయితే, మనుషుల మధ్య దూరాలు తగ్గి ప్రేమలు పెరుగుతాయి. అది తెలుసుకోని జనం ఒకరికొకరు ఎదురుగా ఉండి కూడా ఎవరికి ఏమీ కాని వాళ్లు అయిపోతున్నారు. చివరకు ఒకరిపై మరొకరు ప్రేమానురాగాలు చూపించుకోవడానికి సైతం ఫేస్‌బుక్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నే ఆశ్రయిస్తున్నారంటే మానవ సంబంధాలు ఎంత బలహీనమయ్యాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుని మసులుకుంటే సమస్యలు వాటికవే సమసిపోతాయి.. బంధాలు మరింత బలపడతాయి. 


తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు: 
https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi


హిందీలో చదవడం కోసం క్లిక్ చేయండి:  डियर जिंदगी : तुम समझ रहे हो मेरी बात!