అక్కడ జనాభా కంటే `మెసేజ్`లే ఎక్కువట!
అనగనగా ఒకదేశం. ఆ దేశంలో వేల దీవులు. జనాభా 10 కోట్లు. ఆ దేశం జనాభాకు నాలుగింతలు ఎక్కువగా మెసేజ్ లు పంపిస్తుంది. అంటే సగటుకు ఒకొక్కరు నాలుగు మెసేజ్ లు చేస్తారన్నమాట. ఈ లెక్క ఏ ఏడాదిదో, నెలదో కాదు.. రోజుకీ. ఇంతకీ ఆ దేశమేదో చెప్పలేదు కదూ..! ఫిలిప్పీన్స్... ఇదొక్కటే కాదు ఇలాంటి విషయాలు ఫిలిప్పీన్స్ లో ఎన్నో దాగి ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండీ.
* ఫిలిప్పీన్స్ లో 7,641 దీవులు ఉన్నాయి. ఇన్ని ద్వీపాల సమూహాన్ని కలిగిఉన్న ఫిలిప్పీన్స్ ను అర్చిపిలాగో అని కూడా పిలుస్తారు. ఇందులో జనావాసానికి అనువైనవి రెండువేలే.. మిగితా దీవులకు అసలు పేర్లే లేవు.
*ఫిలిప్పీన్స్ లో ప్రజలు కొండల్లో వ్యవసాయం చేస్తారు. అలా వారు అక్కడ రెండువేల సంవత్సరాల నుంచి చేస్తున్నారట. కొండను గట్లుగట్లుగా చేసుకొని చదును చేస్తారు. అలా చదును చేసుకున్న భూమిలో వరి పండిస్తారు.
* పూర్వం ఇది స్పెయిన్ వాళ్ల ఆధీనంలో ఉండేది. స్పెయిన్ రాజు రెండవ ఫిలిప్ గౌరవార్థం ఫిలిప్పీన్స్ అనే పేరు వచ్చింది.
* ఫిలిప్పీన్స్ లో కొబ్బరి ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ప్రపంచంలోనే కొబ్బరి ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఫిలిప్పీన్స్ మొదటిస్థానంలో ఉంది.
* జనాభా పరంగా ఫిలిప్పీన్స్ ఆసియా ఖండంలో 7వ స్థానంలో, ప్రపంచములో 12వ స్థానంలో ఉంది. పొడవైన సముద్ర తీరం కలిగి ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.
* ఫిలిప్పీన్స్ ' పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో భూమధ్యరేఖకు దగ్గరలో ఉంది. అందుకే సాధారణంగా ఇక్కడ రోజుకీ 10 నుంచి 20 వరకు భూప్రకంపనలు వస్తుంటాయి.
* ఈ దేశంలో ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్ లు చేస్తారు. అందుకే దీనిని ' టెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్' అని పిలుస్తారు. జనాభాకు మించి నాలుగురెట్లు ఎక్కువగా రోజుకు నలభై కోట్లకు పైగా మెసేజ్ లు పంపుతారట.
* ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. దీనికి ఆపేరు అక్కడి మడ అడవుల్లో పెరిగే ' నీలాడ్' పూల నుంచి వచ్చింది. మనీలాలోనే కోటిమందికి పైగా జనాభా నివసిస్తున్నారు.
* ప్రపంచంలో ఉన్న టాప్ టెన్ షాపింగ్ మాల్స్ లలో మూడు మాల్స్ ఇక్కడే ఉన్నాయి.
* ఫిలిప్పీన్స్ ద్వీప దేశం. చుట్టూ కనుచూపుమేర సముద్రమే కనిపిస్తుంది. కాబట్టే ఇది ఏ దేశంతో సరిహద్దును పంచుకోదు.