అంతర్జాతీయంగా దీపావళి వెలుగులు..!
మీకో విషయం తెలుసా.. దీపావళి దాదాపు 10 దేశాల్లో అధికారిక సెలవు దినం. అలాగే 25 దేశాల్లో అతి పెద్ద ఉత్సవంగా జరుపుకొనే పండుగ. సాధారణంగా హిందువుల జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో మనం దీపావళి జరుపుకోవడం చూస్తుంటాం. ఈ వ్యాసంలో దీపావళి రోజున ఏ దేశాలు తమ పౌరులకు సెలవు ప్రకటిస్తాయో తెలుసుకుందాం.
ఫిజి - ఈ దేశంలో దాదాపు 1/3 శాతం హిందువులున్నారు. అందుకే దీపావళి రోజు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. భారత స్వాతంత్య్రానికి ముందు ఫిజి ప్రాంతానికి వలస వెళ్ళిపోయిన భారతీయులు ఆ దేశానికి దీపావళిని పరిచయం చేశారని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఇదే దేశంలో దీపావళి పండుగ రోజును వారం రోజుల పాటు జరుపుకుంటారట ప్రజలు.
ఇండోనేషియా - ఈ దేశంలో గలుంగన్ అనే పండుగను జరుపుకుంటారు. దాదాపు ఈ పండుగ దీపావళినే పోలి ఉంటుంది. దాదాపు 10 రోజుల పాటు జరుపుకొనే ఈ పండుగను ధర్మం, అధర్మంపై చేసే యుద్ధంగా పరిగణిస్తారు
నేపాల్ - నేపాల్‌లో దీపావళిని పోలే పండుగ ఒకటి ఉంది. దానినే తిహార్ లేదా స్వాంతి అంటారు. 5 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. పండుగ చివరి రోజు అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు స్వయంగా భోజనం తినిపిస్తారు.
మలేషియా - సాధారణంగా మలేషియాలో నివసించే హిందువులు అక్కడ దీపావళి జరుపుకుంటారు. దీపావళి మలేషియాలో అధికారిక సెలవుదినంగా గెజిట్‌లో కూడా పేర్కొనబడింది. దీపావళితో పాటు లక్ష్మీపూజను కూడా ఆ దేశంలో హిందువులు విరివిగా జరుపుకుంటారు
మారిషస్ - మారిషస్‌లో కూడా దీపావళి అధికారిక పర్వదినమే. ఈ రోజు హిందువులు స్థానిక దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు
మయన్మార్ - మయన్మార్‌లో కూడా దీపావళి అధికారిక సెలవుదినమే. ఈ రోజున హిందువులతో పాటు కొన్ని బౌద్ధ కుటుంబాలు కూడా ఇంట్లో దీపాలు వెలిగించి, కొత్త బట్టలు ధరించి, పూజలు చేస్తారు.
సింగపూర్ - సింగపూర్‌లో కూడా దీపావళిని పబ్లిక్ హాలిడేగా పరిగణిస్తారు. అయితే కాలుష్యాన్ని నివారించడానికి పలుప్రాంతాల్లో టపాకాయల వాడకాన్ని బహిష్కరించారు
శ్రీలంక - శ్రీలంకలో దీపావళి రోజున హిందువులు ఉదయానే లేచి తలంటు స్నానం చేసి, దేవాలయాలను సందర్శిస్తారు. దీపావళి రోజు శ్రీలంకలో సెలవు దినమే.
ఈ దేశాలే కాకుండా సురినమ్, ట్రినిడాడ్ టుబాగో, అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భుటాన్, థాయిలాండ్, కెన్యా, కెనడా లాంటి దేశాల్లో కూడా దీపావళిని హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు.