చింతచిగురు అన్నం తయారీ సింపుల్
చింత చిగురు.. దీనినే చింతాకు అంటారు.
చింత చిగురు.. దీనినే చింతాకు అంటారు. ఈ చింతాకును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫిలిప్పైన్స్‌లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారట. దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా నాన్‌వెజ్ వంటల్లో వేసి వండుతారు. పప్పు, రైస్, చిత్రాన్నం, పచ్చడి, పొడి ఇలాంటివాట్లో కూడా వాడుతారు. ఇప్పుడు మనం చింతచిగురు రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
చింతచిగురు రైస్ తయారీకి కావలసినవి:
బియ్యం: కప్పు
చింతచిగురు: 4 కప్పులు
సెనగపప్పు: అరకప్పు
ఎండుమిర్చి: నాలుగు
పచ్చిమిర్చి: నాలుగు
జీలకర్ర: టీస్పూను
ఆవాలు: టీస్పూను
మినప్పప్పు: 2 టీస్పూన్లు
నూనె: 5 టీస్పూన్లు
కొబ్బరి తురుము: 2 టీస్పూన్లు
ఉప్పు: తగినంత
జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు
కరివేపాకు: 2 రెబ్బలు
తయారుచేసే విధానం:
చింతచిగురును బాగా శుభ్రంగా కడిగి కాడలు, పుల్లలు తీయాలి. ఓ గిన్నెలో బియ్యం, సెనగపప్పు వేసి కడగాలి.
తరవాత అందులోనే చింతచిగురు వేసి, మూడు కప్పుల నీళ్లు పోసి, టీస్పూను నూనె వేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి.
బాణలిలో నూనె వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించుకొని.. ఆతరువాత జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించి ఉంచాలి.
ఉడికించిన అన్నం మిశ్రమాన్ని వెడల్పాటి బేసిన్‌లో వేసుకొని చల్లారాక.. ఇదివరకే వేయించి పెట్టుకున్న పోపు వేసి కలిపితే సరి..!