హోటల్ ఆంధ్రాలో ఉన్నా..తెలుగోడికి `నో` ఎంట్రీ..!
అనంతపురం ప్రాంతంలోని ఓ హోటల్‌కి వెళ్లిన రాహుల్ అనే కుర్రాడికి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. నగరంలో ఉన్న మొజావే అనే గెస్ట్ హౌస్ కమ్ రెస్టారెంటుకి తన స్నేహితుడితో పాటు వెళ్లిన అతన్ని ఆ హోటల్ నిర్వాహకులు లోపలికి రానివ్వలేదు. కారణమడిగితే.. ఆ హోటల్‌లో కొరియన్లకు తప్ప ఇతరులకు ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు.
ఆ విషయాన్ని ప్రకటించిన ఓ బోర్డుని కూడా చూపించారు. అదే నగరంలో సేవలందిస్తున్న విదేశీ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. జాతి, మత, కుల భేదాలు లేకుండా ఎవరైనా అక్కడికి వెళ్లి రావచ్చు. అయితే ఈ ఒక్క రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రమే రేసిస్టుల్లా వ్యవహరించడంపై రాహుల్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో హోటల్ బిజినెస్ పెట్టుకుంటూ.. అందులోకి తెలుగువారిని రానివ్వకపోవడాన్ని ఆయన ఖండించారు.
ఈ క్రమంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ఓ సోషల్ మీడియా పోస్టు కూడా పెట్టారు. అయితే భారతదేశంలో ఉంటూ కూడా భారతీయులు రావడాన్ని నిషేధించిన హోటళ్ళు కేవలంఆంధ్రాలోనే ఉన్నాయనకుంటే పొరపాటే. ప్రముఖ టూరిజం ప్రాంతాలైన గోవా, అండమాన్ లాంటి చోట్ల కూడా కొన్ని విదేశీ హోటళ్లు ఇలాంటి కండీషన్లు పెట్టడం గమనార్హం. అయితే అనంతపురంలో విషయం వేరు.
స్థానిక సౌత్ కొరియన్ టౌన్ షిప్‌కి దగ్గరలో ఆ హోటల్ ఉంది. కనుక, కొరియన్లకు తప్ప స్థానికులకు లోపలికి అనుమతి లేదని ఆ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాహుల్ పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. రెస్టారెంట్ నిర్వాహకులు ఎవరిని లోపలికి పంపించాలో.. ఎవరిని లోపలికి పంపించకూడదో అన్నది వారి ఇష్టమని కొందరు అంటుంటే.. అలా రేసిస్టులు మాత్రమే చేస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు