విదేశాల్లో పనిచేసే భారతీయులకూ పీఎఫ్
విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా పీఎఫ్ లో భాగస్వాములు కావొచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తమకు పీఎఫ్ లో భాగస్తులుగా చేర్చాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వారి విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఇకపై వారు కూడా పీఎఫ్ ఖాతా తెరవచ్చని తెలిపింది.
"ఇక నుంచి విదేశాల్లో పనిచేసే భారతీయులు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) లో లబ్ధిదారులు కావచ్చు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు వారు పనిచేస్తున్న దేశంలో సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకుని ఈపీఎఫ్‌ఓలో చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఇందుకోసం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నాం" అని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ) పొందవచ్చని, విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా సీవోసీకి దరఖాస్తు చేయవచ్చని జాయ్ చెప్పారు.