అమెరికాలో భారత విద్యార్ధి హత్య
అమెరికాలో భారత విద్యార్థిపై బుధువారం కాల్పులు జరిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వ్యక్తి పంజాబ్ కు చెందినవాడు, అకౌంటింగ్ విద్యార్థి.
అమెరికాలో భారత విద్యార్థిపై బుధువారం కాల్పులు జరిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక దినపత్రికలో తెలిపిన కథనం మేరకు వివరాలలోకి వెళితే.. కాలిఫోర్నియాలో ఒక సూపర్ మార్కెట్లో ధరమ్ ప్రీత్ సింగ్ (21) అనే భారతీయ విద్యార్ధి పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటున్నాడు. బుధువారం ధరమ్ విధి నిర్వహణలో ఉండగా నలుగురు దుండగులు ముసుగు వేసుకొని సూపర్ మార్కెట్ లోనికి ప్రవేశించారు. స్టోర్ లో ఉన్న సరుకులు, నగదు దోచుకొని పోతుండగా క్యాష్ కౌంటర్ వద్ద నక్కి ఉన్న ధరమ్ ను చూసి కాల్చి వెళ్లిపోయారు. వచ్చిన నలుగురు దుండగుల్లో ఒక భారతీయడు కూడా ఉన్నాడు. నేలపై మృతదేహంగా పడిఉన్న ధరమ్ ను చూసి వినియోగదారుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనాస్ధలికి వెళ్లి విచారణ చేపట్టారు.
పోలీసులు చనిపోయిన వ్యక్తిని గుర్తించి వెంటనే భారత రాయబార కార్యాలయానికి కబురు పంపారు. ఆ వ్యక్తి పంజాబ్ కు చెందినవాడని, అకౌంటింగ్ విద్యార్థి అని చెప్పారు. విద్యార్థి వీసాపై అమెరికా వచ్చాడని, వచ్చి మూడు సంవత్సరాలు అవుతోందని వారు పోలీసులకు చెప్పారు. కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు అనుమానితుల్లో ఒకరిగా భావిస్తున్న భారత సంతతికి చెందిన అత్వాల్ (22) ను అరెస్ట్ చేశారు. అతనిపై హత్య, దొంగతనం కేసులు పెట్టారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ట్విట్టర్ లో ఈ విషయంపై స్పందించారు. దుండగులకు శిక్షపడేట్లు చూస్తానని హామీ ఇచ్చారు.