మాల్యా కోసం జైలు సిద్ధంగా ఉంది: సీబీఐ
లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాను సీబీఐ వదిలేది లేదని మరోసారి స్పష్టం చేసింది.
లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాను సీబీఐ వదిలేది లేదని మరోసారి స్పష్టం చేసింది. 9 వేల కోట్ల రూపాయలకు పైగా మోసగించిన మాల్యాను జైలుకు పంపించడమే తమ కర్తవ్యం అని పేర్కొంది. విజయ్ మాల్యా కోసం జైలు సిద్ధంగా ఉందని సీబీఐ లండన్‌లో మాల్యా కేసు విచారిస్తున్న కోర్టుకు తెలిపింది. ఈ జైలులో సెల్ యూరప్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తెలిపింది. మాల్యాకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఆధారాలను కోర్టు ఆమోదించి పరిగణనలోకి తీసుకున్న సందర్భంగా సీబీఐ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.
దీంతో మాల్యాను ఇండియాకు రప్పించేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు లభించినట్లయింది. మాల్యాను భారత్‌కు రప్పించే కేసు విచారణ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం జరిగిన విచారణకు మాల్యా లండన్ కోర్టుకు హాజరయ్యారు. భారత్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) సమర్పించిన ఆధారాలపై స్పందించేందుకు కాస్త టైం ఇవ్వాలని మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్ అందచేసిన సమాచారం సంతృప్తిగా ఉందని వ్యక్తంచేస్తూ.. జూలై 11కు విచారణ వాయిదా వేశారు.