భారత్ నుంచి వెళ్లిపోవడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసినట్లు మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ప్రకటించడం.. రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. వారిద్దరి కలయికపై వెంటనే ప్రధాని జోక్యం చేసుకోవాలని, స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని, జైట్లీని తక్షణం కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీరవ్ మోదీ, మెహుల్‌ ఛోక్సీలు దేశం విడిచి ఎందుకు, ఎలా పారిపోయారో.. చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వి కేంద్రాన్ని ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం.. వెస్ట్ మినిస్టర్ కోర్టు వెలుపల మాల్యా మాట్లాడుతూ.. తాను భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్ళే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని సంచలన ఆరోపణ చేశారు. తాను భారతదేశం నుండి వెళ్లిపోవడానికి ముందు జైట్లీని కలిశానని, బ్యాంకు రుణాల సమస్యను సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పానని అన్నారు. తాను రుణాలు చెల్లిస్తానంటే బ్యాంకులు ఎందుకు ముందుకు రావట్లేదో వారినే అడగాలని మీడియాకు చెప్పారు. 'రాజకీయ పార్టీలన్నీ నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాయి. నేనో బలిపశువునయ్యా' అన్నారు. అయితే మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.


తనను కలిసినట్లు విజయ్ మాల్యా చెప్తున్న మాటల్లో నిజం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. 2014లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను అసలు విజయ్ మాల్యాకు అపాయింట్‌మెంటే ఇవ్వలేదని, ఎంపీ హోదాను అడ్డంపెట్టుకొని పార్లమెంటులో నన్ను కలవడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు అరుణ్ జైట్లీ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.


అయితే.. మీడియా తన మాటలను తప్పుదోవ పట్టించిందని మళ్లీ మాల్యా యూ-టర్న్ తీసుకోవడం విశేషం.


మాల్యా 2016 మార్చి 2న భారతదేశం నుంచి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం బ్రిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ తుది దశలో ఉంది.