7th Pay Commission Latest News: ఆ ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ క్లెయిమ్స్‌పై కేంద్రం లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గత ఏడాది (1 జనవరి 2020) నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ సహా ఇతరత్రా ప్రయోజనాలు అందడం లేదు. ఏడో వేతన సవరణ సంఘం ప్రకారం జూలై 1 నుంచి పెండింగ్ 3 డీఏల పెంపుతో సవరించిన వేతనాలు అందుతాయని 52 లక్షల ఉద్యోగులు, 61 లక్షల పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయ స్కూల్ ఉద్యోగులకు ఓ విషయంలో శుభవార్త చెప్పింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్‌ను రీజనల్ ఆఫీసుకు బదులుగా నేరుగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అమోదించేలా మార్పులు చేశారు. స్థానికంగా తీసుకున్న చికిత్సకు సంబంధించిన బిల్లులపై స్కూల్ ప్రిన్సిపాల్ ఆమోదం పరిమితిని 5 రెట్లు పెంచారు. గతంలో రూ.5 వేలు దాటితే రీజనల్ ఆఫీసుకు మెడికల్ బిల్లులను ఆమోదం కోసం పంపేవారు.
ప్రస్తుతానికి రూ.5000 మేర మెడికల్ బిల్లులకు ప్రిన్సిపాల్ ఆమోదించేవారు. ఈ పరిమితిని ఇకనుంచి రూ.25000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లేదా సీజీహెచ్ఎస్ గుర్తింపు ఉన్న ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటే నవోదయ విద్యాలయ సమితి స్కూల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రిన్సిపాల్ ఆమోదం పరిమితిని పెంచారు.
ఆథరైజ్‌డ్ మెడికల్ అటెండెంట్ (Authorised Medical Attendant) వద్ద చికిత్స తీసుకున్న నవోదయ విద్యాలయ సమితి స్కూల్స్ ఉద్యోగులకు సైతం మెడికల్ బిల్లుల క్లెయిమ్ అనుమతి పరిమితిని పెంచారు. ఇప్పటివరకూ ప్రిన్సిపాల్‌కు రూ.5000 మేర మెడికల్ బిల్లులను క్లెయిమ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపే పరిమితి రూ.15000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
రీజనల్ ఆఫీసు మరియు ఎన్‌ఎల్ఐ సిబ్బంది మెడికల్ బిల్లుల అమోదం పరిమితి యథాతథంగా ఉంది. ఆథరైజ్‌డ్ మెడికల్ అటెండెంట్ దగ్గర చికిత్స తీసుకుంటే రూ.15000 వరకు డిప్యూటీ కమిషనర్ ఉద్యోగుల మెడికల్ బిల్లులను ఆమోదం తెలపవచ్చు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సైతం గతంలో ఉన్న మెడికల్ క్లెయిమ్ పరిమితి యథాతథంగా ఉంది.