ADHAAR : లేడీస్ ఆధార్ విషయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి..ఉద్యోగినులైతే మరింత జాగ్రత్త పడాల్సిందే
ADHAAR Struggles: దేశంలోని పౌరులందరికీ ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారింది. ప్రతి పనికి ఆధార్ ఉండాల్సిందే. ఈ క్రమంలో ఆధార్ కార్డులను జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు వాటిలో తప్పుఒప్పులు సవరించుకుని వారు ఆధార్ లో వివరాలను అప్ డేట్ చేసుకునివారి కూడా దేశంలో కోట్లాది మంది ఉన్నారు.
ఆధార్ జారీ చేసే సమయంలో ప్రాథమికంగా ఉన్న సమాచారం ఆధారంగా అందులో వివరాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మహిళలు, గృహిణులు తమ భర్తల ఇంటిపేర్లతో ఆధార్ కార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.
ఆధార్ కార్డు విశిష్ట సంఖ్య ఇప్పుడు దేశంలో అన్నింటికి ఆధారంగా ఉంది. పుట్టినప్పటి నుంచి చివరి వరకు అన్ని వివరాలు ఆధార్ తోనే ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలో చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలకు కొత్త చిక్కులు తప్పడం లేదు. ఆధార్ కార్డులు జారీ చేసే సమయంలో నమోదు చేసిన వివరాలకు వారి సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు మార్పులు ఉన్నట్లయితే వాటిని సవరించుకోవడానికి తిప్పలు పడుతున్నారు.
చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలుకూడా పలు కారణాలతో ఆధార్ కార్డుల్లో భర్త ఇంటిపేరును ఎంటర్ చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ పాన్ కార్డుల ద్వారా పన్నులు చేలిస్తున్న మహిళల్లో కూడా కొందరు ఆధార్ కార్డుల్లో అత్తింటి పేర్లను నమోదు చేసుకోవడమో, మార్చకోడమో జరిగింది. ఇలా చేసిన వారికి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆధార్ , పాన్ కార్డుల్లో ఒకే రకమైన పేర్లు ఉంటేనే లింకింగ్ అనేది జరిగింది. వేరు వేరు పేర్లు ఉన్నవారిలో చాలా మంది ఇప్పటికీ ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కొనసాగుతున్న మహిళలు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డులను పుట్టింటి పేర్లతోనే కొనసాగించడం కూడా ఉత్తమం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగినులు ఆధార్ జారీకి ముందు నుంచి పాన్ కార్డుల్లో ఉన్న వివరాలనే విధిగా కొనసాగించాలని చెబుతున్నారు. వేతనాలు, సర్వీస్ రికార్డులు, పెన్షన్ చెల్లింపులు ఇవన్నీ కూడా విద్యార్హతల్లో ఉన్న పేర్ల ఆధారంగానే కొనసాగుతాయి. మహిళల పేరుతో జరిగే రిజిస్ట్రేషన్లో భార్య అసలు పేరుతో పాటు భర్త పేరును ఇంటి పేరుతో సహా నమోదు చేయాలని చెబుతున్నారు. ఆధార్ విషయంలో అనాలోచితంగా చేసే పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.