Ananya Panday : డ్రగ్స్ కేసులో రెండో రోజూ ఎన్సీబీ విచారణకు హాజరైన అనన్య పాండే
డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జరిపిన వాట్సాప్ చర్చల్లో అనన్య పేరు రావడంతో నిన్న అధికారులు ఆమె నివాసానికి వెళ్లి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఈ రోజు కూడా ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
చాలా సేపు అనన్యను ప్రశ్నించిన అధికారులు.. ఆర్యన్‌తో వాట్సాప్ చాట్ గురించి మరిన్ని వివరాలపై ఆరా తీశారు. వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్ చర్చ జరిగిందని ఎన్‌సీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 2న జరిగిన క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సప్ చాట్ చేసినట్లు సమాచారం. అన్యన విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్‌తో డ్రగ్స్ చాట్ గురించి అధికారులు ఆమెను ప్రశ్నించగా.. తాను జోక్ చేశానని అనన్య చెప్పినట్లు సమాచారం.
గంజాయి కోసం ఆర్యన్ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్‌లో ఉందని సమాచారం. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్లు తెలుస్తోంది.
తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. అయితే ఆర్యన్ కోసం అనన్య డ్రగ్స్ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.