Chaturmasya Deeksha: చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి ..? ఎప్పటి నుంచి ప్రారంభం అంటే.. ?
తొలి ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్య దీక్ష కూడా మొదలవుతోంది. ఇక భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తాను తిథుల్లో ఏకాదశి తిథి అంటూ స్వయంగా చెప్పారు. దీంతో ఈ తిథి హిందువులకు ఎంతో పవిత్రమైంది. ఒక ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశిగా మనందరం ఎంతో ఘనంగా జరుపుకుంటాము. తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతం ఈ రోజే మొదలవుతుంది.
విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు ఆదిశేషు పైన శయనించేది ఈ రోజు కనుక తొలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి అత్యంత ఇష్టమైనది.
ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది ఆషాడమాసంలోనే. ఈ పండుగ దాదాపు దక్షిణాయనం ప్రారంభమైన తరువాత మొదటి పండుగని తొలి ఏకాదశిగా ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ ఒకపుడు ఏరువాక వేడుకల్లో భాగంగా చేసేవారు.
దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువును పూజించి సేవిస్తారు. ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన శేషశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణ వచనం. అందుకే ఈ నాలుగు మాసములను చాతుర్మాసాలు అంటారు.
విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. దాంతో ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించారు. సూర్యవంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతనికి ధర్మము తప్పడు, సత్యసంధుడు అనే పేరుంది. అతడు పాలించే రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణ గాథ.
ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే, భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. అయిదు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలనే దీని సారం. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని భక్తుల విశ్వాసం.
ఆధ్యాత్మిక గురువులు, పీఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి 4 మాసముల కాలం పాటు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహ భాషణలు ఇస్తారు. అందువలన ఈ దీక్ష కాలమును 'చాతుర్మాస్య దీక్ష'గా పిలుస్తారు. ఈ దీక్షా కాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు. ఏకాదశి వ్రతం ఆచరించే వారితో పాటు అందరికి ఉపవాసం శ్రేష్టం.