Credit cards news: క్రెడిట్ కార్డులకు పెరిగిన డిమాండ్.. ఎందుకో తెలుసా ?
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ప్రకారం చిన్న చిన్న పట్టణాలు, నాన్-మెట్రో సిటీల నుంచి క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మెట్రో సిటీల్లో క్రెడిట్ కార్డుల నమోదులో అంతగా వృద్ధి నమోదు కాలేదు.
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ఎస్‌బిఐ 4.6 లక్షల కార్డులను జారీ చేసిందని, అదే సమయంలో ప్రైవేటు రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ( HDFC bank ) 4.8 లక్షలు, ఐసిఐసిఐ బ్యాంక్ ( ICICI bank ) 1.6 లక్షల కార్డులను జారీ చేసినట్లు ఆర్‌బిఐ డేటా వెల్లడించింది.
కోవిడ్-19 లాక్డౌన్ చర్యలను సడలించినప్పటి నుండి వినియోగదారుల ఆర్థిక వ్యవహారాల్లో కొంత పెరుగుదల కనిపించడమే ఇందుకు ఓ కారణంగా ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ కేల్కర్ తెలిపారు.
మరోవైపు లాక్‌డౌన్ కారణంగా అన్నిరంగాల్లో ఆర్థిక ఒడిదుడుకులు ( Financial crisis ) స్పష్టంగా కనిపించింది. ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోవడం, స్వయం ఉపాధిపై ఆధారపడి జీవనాధారం కొనసాగిస్తున్న వారు కూడా బతుకుదెరువు కోల్పోవడం వంటివి వారి ఆర్థిక స్థితిగతులను క్షీణించేలా చేసింది.
దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరగడమే ఈ ఏడాది అక్టోబర్ నాటికి క్రెడిట్ కార్డుల వినియోగం ( Credit cards usage ) పెరగడానికి మరో కారణమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ఆర్థిక మాంద్యం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపించడంతో ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదనే సంగతి తెలిసిందే.
ఆర్థిక మాంద్యంలో ( Economic recession ) ఉన్న పలు రంగాలతో బ్యాంకులు సైతం ఓ జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఆ జాబితాలో ఉన్న రంగాలకు చెందిన ఉద్యోగులకు క్రెడిట్ కార్డులు జారీచేయకూడదని బ్యాంకులు కఠినంగానే నిర్ణయించుకున్నాయి.
అలా బ్యాంకుల జాబితాలో ఉన్న రంగాల్లో ప్రధానమైనది ఎయిర్‌లైన్స్ రంగం కాగా ఫైనాన్స్, రియాలిటీ, మీడియా లాంటి పరిశ్రమలు ఆ తర్వాతి జాబితాలో ఉన్నాయి.
బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి క్రెడిట్ కార్డులు ( Credit cards ) లభించడం కష్టంగా మారింది. కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే కాకుండా ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి రుణాలు మంజూరు ( Loans sanctioning ) చేసేందుకు సైతం బ్యాంకులు ముందుకు రావడం లేదు.
కొత్త క్రెడిట్ కార్డులు జారీచేయకపోవడమే కాకుండా పాత క్రెడిట్ కార్డుల క్రెడిట్ లిమిట్ ( Credit limit ) తగ్గించిన బ్యాంకులు సైతం ఉన్నాయి. వారు ఆధారపడిన పరిశ్రమలు ఆర్థిక మాంద్యంలో ఉండటం వల్ల ఒకవేళ వాళ్లు ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోతే.. అప్పటికే బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం ( Credit cards bills repayment / loans EMI repayments ) కష్టం అవుతుందనే కారణంగానే బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.