EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?
EPS-95 Pension: సుదీర్ఘకాలంగా ఈపీఎఫ్ఓ ఈపీఎస్ -95 స్కీం పెన్షన్ దారుల డిమాండ్ కు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఈపీఎస్ 95 పెన్షన్ దారుల డిమాండ్లను పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ హామీ అందించారు. అంతేకాదు హయ్యర్ పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు అందించింది. దీనిపై ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ కోరింది. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ 7500 రూపాయలకు పెరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
ఉద్యోగుల పెన్షన్ స్కీం -1995 కింద కనీస పెన్షన్ రూ.7500కు పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ పింఛనుదారులకు నెలవారి పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇటీవల ఈపీఎస్ 95 చీఫ్ కోఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ ఇటీవల మాట్లాడుతూ ..ఈపీఎస్ 95 కింద 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని వీరిలో 40 లక్షల మందికి కేవలం 1500 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ వస్తుందని మిగతా వారికి రూ. 2000 నుంచి 2500 మధ్యలో పెన్షన్ లభిస్తోందని ఆయన వాపోయారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హయ్యర్ పెన్షన్ కింద కనీస పెన్షన్ 7,500 రూపాయలకు తక్షణమే పెంచాలని రిటైర్ అయిన వారికి సామాజిక భద్రత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
EPS-95 నేషనల్ మూవ్‌మెంట్ కమిటీ (NAC)లో దాదాపు 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు 7.5 కోట్ల మంది పారిశ్రామిక రంగాల ఉద్యోగులు ఉన్నారని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే. ఈపీఎఫ్‌వో సూచనలో భాగంగా ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చినట్లు ఎన్ఏసీ ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్‌దారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
గత ఆగస్టు ప్రారంభంలో, EPS-95 NAC ప్రతినిధులు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్యను కూడా కలిశారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మాండవ్య హామీ ఇచ్చారు. తమ కమిటీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తే, ఈపీఎఫ్‌వోతో అనుబంధం ఉన్న కోట్ల మంది ఉద్యోగులు, పెన్షన్ దారులు ప్రయోజనం పొందుతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు EPS-95 రాష్ట్రీయ ఆందోళన్ సమితి EPS సభ్యులు వారి జీవిత భాగస్వాములకు పూర్తి వైద్య కవరేజీని అందించాలని కూడా కమిటీ డిమాండ్ చేస్తుంది. కనీస పింఛను పెంచాలని గత ఎనిమిదేళ్లుగా పింఛనుదారులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ అన్నారు.