Teku Chepa: ఏపీలో గాలానికి చిక్కిన 1500 కేజీల బాహుబలి చేప.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో..నదులు, వాగులు, సరస్సులు పొండిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే మత్స్యకారులు అనేక ప్రాంతాలలో చేపల వేటకు వెళ్తున్నారు. అయితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మత్స్యకారులకు ఆదివారం ఓ భారీ చేపవలలో చిక్కింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గిలకలదిండి వద్ద సముద్రంలో దాదాపు 1500 కేజీల టేకు చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. బాహుబలి చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్య్సకారులు నానా తంటాలు పడ్డారు. చివరకు ఇతర మత్య్సకారుల సహాయంలో..భారీ క్రేన్ ను తెప్పించి బైటకు తరలించారు.
భారీ చేపను చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇదిలా ఉండగా.. టేకు చేపలు అత్యంత అరుదుగా దొరుకుతాయని.. ఆయుర్వేద మందుల తయారీకి ఈ చేపను వాడతారని మత్స్యాకారులు పేర్కొన్నారు.
బాహుబలి చేపను కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటిపడ్డట్లు తెలుస్తుంది. దీంతో బాహుబలి టేకు చేపకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ చేప దొరకడంతో తీర ప్రాంతాలలోని చేపలు పట్టేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైకు చెందిన వ్యాపారులు ఈ బాహుబలి చేపను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ చేపలు తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలన్ని దూరమౌతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కళ్లకు సంబంధిచిన సమస్యలు, చెడు కొవ్వు వంటి సమస్యలు కూడా ఉండవని చెప్తున్నారు. కాగా, ఇంతటి భారీ చేపను తరలిస్తోన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇలాంటి చేపలు చాలా అరుదుగా మాత్రమే వలలో చిక్కుతాయని, వరద నీళ్లలో మాత్రమే ఇవి ఎక్కువగా ఉంటాయని మత్య్సకారులు చెబుతున్నారు. దీన్ని అక్కడున్న ప్రజలు ఎంతో ఆశ్చర్యంతో చూశారు. బాబోయ్ ఎంతపెద్ద చేపో అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు.