Global COVID-19 Death Toll: ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కరోనా మరణాలు
Global COVID-19 Deaths Surpass 4 Million Mark: గత ఏడాది నుంచి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపుగా అన్ని రంగాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపచం వ్యాప్తంగా కోట్ల ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య గురువారం నాటికి 40 లక్షలకు చేరింది. రాయ్‌టర్స్ కథనంలో ఈ విషయాలు వెల్లడించింది.
2019 డిసెంబర్ నెలలో చైనాలో పుట్టుకొచ్చిన కోవిడ్19 మహమ్మారి మూడు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. రాయ్‌టర్స్ రిపోర్ట్ ప్రకారం, కరోనా బారిన పడి ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. తొలి 2 మిలియన్ల మరణాలకు ఏడాదికి సైగా సమయం పట్టగా, మిగతా 2 మిలియన్ కోవిడ్19 మరణాలు కేవలం 166 రోజుల వ్యవధిలో సంభవించడం విచారకరం.
కరోనా మరణాలలో తొలి ఐదు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికో ఉన్నాయి. కేవలం ఈ 5 దేశాలల్లో సంభవించిన కరోనా మరణాలు ప్రపంచంలోని మొత్తం కోవిడ్19 మరణాలలో 50 శాతం ఉండటం గమనార్హం. అయితే పెరూ, హంగేరి, బోస్నియా, చెక్ రిపబ్లిక్ మరియు గిబ్రాల్టర్‌లలో జనాభాతో పోల్చితే మరణాలు రేటు అధికంగా ఉంది.
గత మార్చి నెల నుంచి లాటిన్ అమెరికా దేశాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే 100 కరోనా కేసులలో 43 వరకు ఈ దేశాల నుంచే వస్తున్నాయి. బొలీవియా, చిలీ, ఉరుగ్వేలలో అధికంగా 25 నుంచి 40 ఏళ్ల వారిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. బ్రెజిల్‌లోని సావోపోలోలో 80 శాతం ఐసీయూలలో కోవిడ్19 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.
గత కొన్ని రోజులగా ప్రపంచంలో చనిపోతున్న ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒక మరణం భారత్ నుంచి సంభవించింది. వారం సగటు గమనిస్తే భారత్ మరియు బ్రెజిల్ దేశాలల్లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాలను పరిశీలిస్తే, ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని మరణాలు సంభవించి ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.