Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?

Fri, 02 Aug 2024-7:13 pm,

Gold Rate Today: నిజానికి బంగారం ధరలు గతవారం బడ్జెట్ అనంతరం భారీగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఒక్కరోజే బంగారం ధర సుమారు 4000 రూపాయల వరకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 68 వేల రూపాయల వరకు పతనమైంది. అంటే గరిష్ట స్థాయి 75 వేల రూపాయల నుంచి దాదాపు 7వేల రూపాయల వరకు పతనమై 68 వేల రూపాయల వద్ద స్థిరపడింది. అయితే నెమ్మదిగా బంగారం ధర ఈ స్థాయి నుంచి రికవరీ అవుతూ ప్రస్తుతం మళ్ళీ 70 వేల రూపాయల స్థాయికి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులు మళ్లీ ఆభరణాల రేట్లు పెరగటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ఏంటా అని ఆలోచిస్తున్నారు.  

నిజానికి కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను భారీగా తగ్గించడంతో.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాబోయే శ్రావణమాసం ఇక పండగే అని అంతా భావించారు. ఆభరణాల షాపుల వద్ద క్యూలు కట్టారు. బంగారం ధర తగ్గటంతో ఆభరణాలు పెద్ద ఎత్తున అమ్ముడుపోయే అవకాశం ఉందని, నగల వ్యాపారులు సైతం సంబురపడ్డారు. రాబోయే శ్రావణమాసంలో శుభకార్యాలు, వివాహాది మహోత్సవాలు, పండగలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతుందని ఆశించారు. కానీ కేవలం రోజుల వ్యవధిలోనే ఇదంతా రివర్స్ అయిపోయింది.

బంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం అమెరికాలోని ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లు ప్రకటించడమే అని బులియన్ పండితులు చెబుతున్నారు. సాధారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచినప్పుడల్లా.. బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కీలక వడ్డీ రేట్లు పెంచినప్పుడల్లా యూఎస్ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.   

ఫెడరల్ బ్యాంకు రిజర్వ్ వడ్డీరేట్లు పెంచినప్పుడల్లా ఈ బాండ్లపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అందుకని తమ పెట్టుబడులను బంగారం నుంచి అమెరికా ట్రెజరీ బాండ్ల వైపు తరలిస్తారు. కానీ ఫెడరల్ రిజర్వ్ గత కొన్ని దఫాలుగా వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతూ వస్తోంది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. భవిష్యత్తులో కూడా వడ్డీ రేట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉందనే వార్తలతో ఇన్వెస్టర్లు సేఫస్ట్ పెట్టుబడిగా భావించే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  

మరోవైపు డాలర్ కు బంగారానికి కూడా అభినాభావ సంబంధం ఉంటుంది. డాలర్ బలహీన పడ్డప్పుడల్లా  బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి.  ప్రధానంగా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు శాయశక్తుల పనిచేస్తోంది. దీనికి తోడు చైనా సెంట్రల్ బ్యాంకు  ప్రపంచవ్యాప్తంగా బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది.  ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link