Railway Retired Employees: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్...తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కేంద్రం చర్యలు..
Railway News: దీపావళికి ముందే రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రంలోమోదీ సర్కార్ బంపర్ న్యూస్ అందించింది. సిబ్బంది కొరతను అధిగమించడానికి, భారతీయ రైల్వేలు 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియమించుకోనున్నాయి. ఈ పథకం కింద, 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు సూపర్‌వైజర్, ట్రాక్ మ్యాన్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
బిజినెస్ టుడేలోని ఓ నివేదిక ప్రకారం.. ఈ ఉద్యోగం పొడిగింపు ఎంపికతో రెండేళ్లపాటు ఉంటుంది. అన్ని రైల్వే జోన్‌ల జనరల్ మేనేజర్‌లు పదవీ విరమణ చేసిన వ్యక్తులను వారి మెడికల్ ఫిట్‌నెస్.. గత ఐదేళ్లలో చేసిన పని రేటింగ్ ఆధారంగా రిక్రూట్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా రైల్వేలో ఉద్యోగుల కొరతను ఎదుర్కోవటానికి, రైల్వే బోర్డు 25,000 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రచారాన్ని ప్రారంభించింది. అంతే కాకుండా రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేసే యోచనను ప్రవేశపెట్టారు.
అయితే దీనికి దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్మెంట్ కు ముందు గత ఐదు ఏళ్ల రిపోర్టింగ్ లో మంచి రేటింగ్ తప్పనిసరి. ఇదే కాకుండా ఆ ఉద్యోగిపై ఎలాంటి విజిలెన్స్ లేదా క్రమశిక్షణా కేసు ఉండకూడదు.
దీని కింద రిక్రూట్ చేసుకునే వ్యక్తులు వారి చివరి జీతం నుంచి ప్రాథమిక పెన్షన్ మొత్తాన్ని తీసి వేసి చెల్లిస్తారు. అంతేకాదు ప్రయాణ భత్యం కూడా ఇస్తారు. అయితే వారికి అదనపు ప్రయోజనాలు లేదా జీతం అనేది పెంచరు.
ఇక పెరుగుతున్న రైలు ప్రమాదాలు, ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఒక్క నార్త్ వెస్ట్రన్ రైల్వేలోనే 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నందున రైళ్లను నడపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. సూపర్‌వైజరీ, ఇతర ముఖ్యమైన పోస్టులలోని వ్యక్తుల తక్షణ అవసరాలను తీర్చడానికి, రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియమించాల్సిన అవసరం ఉందని బోర్డు పేర్కొంది.