Shirdi Sai Baba Temple: సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే బాబా దర్శనం
Shirdi Sai Baba Temple - Guidelines: ముంబై: షిర్డీ సాయి బాబా ( Shirdi Sai Baba ) దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఈ నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే భక్తులు బాబా వారి దర్శన భాగ్యం లేకుండానే వెనుదిరాల్సి ఉంటుంది. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ( Shri Saibaba Sansthan Trust ).. డ్రెస్ కోడ్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. షిర్డీ సాయి బాబా దర్శనానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి మందిరం లోపలికి ప్రవేశించాలని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తులకు సూచించింది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి రావాలని కోరుతూ మందిర ప్రాంగణంలో, క్యూలైన్లు, తదితర చోట్ల బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే భక్తులు ఎవరైనా అసభ్యకర రీతిలో (పొట్టి దుస్తులు) దుస్తులు ధరించి వస్తే వారిని ప్రవేశ ద్వారం దగ్గరే నిలిపివేస్తామని సంస్థాన్ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ఎలాంటి డ్రెస్‌కోడ్ విధించలేదని.. సంప్రదాయ దుస్తులను ధరించి రావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. ఆలయానికి కొంతమంది అసభ్యకర వస్త్రధారణతో వస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. పవిత్రమైన స్థలానికి సంప్రదాయ పద్ధతిలో మందిరానికి రావాలని సూచిస్తున్నట్లు తెలిపారు.