Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటి నుంచి 2 రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలపై ఉంటుందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాలు గత నెలలో కూడా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. చెన్నైలో కూడా ఇదే దుస్థితి.
అయితే, తాజాగా మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాయలసీమతోపాటు కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు బుధవారం నుంచి శుక్రవారం వరకు రెండు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయట.
ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూల్, అనంతపురం జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. కానీ, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరికోతకు వెళ్లే రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరించి తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ.