Christmas Star: ఆకాశంలో అరుదైన క్రిస్మస్ స్టార్.. ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడో
ఉత్తర అర్ధగోళంలో ఉన్న వాళ్లు సూర్యస్తమయం తర్వాత 45 నిమిషాలకు ఆకాశంలో నైరుతి దిశగా చూస్తే ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది.
వాస్తవానికి బృహస్పతి, శని గ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి సమీపంలోకి రావు. బృహస్పతి భూమి నుంచి 5 ఆస్ట్రానమికల్ యూనిట్స్ దూరంలో ఉంటే.. శనిగ్రహం 10 ఆస్ట్రానమికల్ యూనిట్స్‌లో ఉంటుంది. కానీ డిసెంబర్ 21 నాడు సాయంత్రం అవి ఒకదానికొకటి సమీపంలోకి వచ్చినట్టుగా కనిపిస్తాయంతే.
ఈ రెండు గ్రహాలు ఇలా వరుస క్రమంలోకి రావడం అనేది ప్రతీ 20 ఏళ్లకు ఒకసారి అరుదుగా జరిగేదే అయినప్పటికీ.. ఇలా ఇంత దగ్గరిగా వచ్చినట్టు కనిపించడం మాత్రం నిజంగానే చాలా చాలా అరుదైన అద్భుతం అని హూస్టన్‌లోని రైస్ యూనివర్శిటీలో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమి ప్రొఫెసర్‌గా ఉన్న ప్యాట్రిక్ హ్యార్టిగన్ తెలిపారు.
గతంలో 1226లో మార్చి 4న ఇలాంటి అద్భుతం జరిగిందని.. ఆ తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జుపిటర్, శాటర్న్ గ్రహాలు ఈ ఏడాది ఎండా కాలంలోనే భూమ్యాకాశంలోకి ప్రవేశించినట్టుగా కనిపించినప్పటికీ.. డిసెంబర్ 16-25 మధ్యన అవి మరింత దగ్గరిగా వచ్చినట్టు కనిపించనున్నాయి.
అలా డిసెంబర్ 21 నాడు సూర్యాస్తమయం తర్వాత అవి మరింత సమీపంలోకి వచ్చినట్టుగా కనిపించి డబుల్ ప్లానెట్స్‌లా తలపిస్తాయని ప్యాట్రిక్ హ్యార్టిగన్ తెలిపారు.
ఆకాశం నిర్మలంగా ఉండి వాతావరణం అనుకూలించినట్టయితే... భూమి మీద ఏ మూల నుంచి అయినా ఈ అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. అయితే, ఈక్వేటార్‌కి సమీపంలో ఉన్న వాళ్లకు దీనిని మరింత బాగా వీక్షించేందుకు వీలు కలుగుతుంది.