Kothimeera Vada: ఈ వర్షాలకు వేడి వేడిగా కొత్తిమీర వడలు... ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది!
కొత్తిమీర, శెగనపండి రెండు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు. కొత్తిమీరలో విటమిన్ K, విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలకు అధికంగా ఉంటాయి. శనగపిండి ప్రోటీన్, ఫైబర్‌కు మంచి మూలం. కాబట్టి కొత్తిమీర వడలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
కొత్తిమీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శనగపిండిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కొత్తిమీర వడలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, రక్తహీనతను తగ్గిస్తాయి. శనగపిండి శరీరానికి శక్తిని అందిస్తుంది.
అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా వాడాలి. మధుమేహం ఉన్నవారు శనగపిండి పరిమాణాన్ని తగ్గించి, గోధుమ పిండిని కలపవచ్చు.
ఇప్పుడు కొత్తిమీర వడలు ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు: పల్లీలు - 1/4 కప్పు, శనగపిండి - 1 1/2 కప్పులు, ఇంగువ - 1/4 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, కారం పొడి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి తగినంత, ఆవాలు - 1/2 టీస్పూన్, కొత్తిమీర తరుగు - 1 1/2 కప్పులు
తయారీ విధానం: ముందుగా పల్లీలను స్టౌపై దోరగా వేయించి, మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తని పొడిగా కాకుండా, కాస్త బరకగా రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత తగినంత నీరు పోసి గడ్డలు లేకుండా మృదువైన పిండి చేయాలి.
ఈ పిండిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కలిపి మరోసారి బాగా కలపాలి. స్టౌపై పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిటలనివ్వాలి.
ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. వేయించిన కొత్తిమీరను పిండిలో కలిపి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి, నూనెలో వేడి చేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.