Daaku Maharaaj US Trailer Event: అమెరికాలో ఘనంగా బాలయ్య ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ వేడుక.. ట్రైలర్ విడుదల..

Sun, 05 Jan 2025-1:04 pm,

Daaku Maharaaj US Pre Release Event:నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

వరుస హిట్లతో దూకుడు మీదున్న బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన ఈ వేడుకలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమం అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8:39 కి ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 44 సెకన్ల నిడివి ఉంది.  'డాకు మహారాజ్' ట్రైలర్ అద్భుతంగా ఉంది. "అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజ్." అంటూ ఒక పాప వాయిస్ తో ట్రైలర్ ను ప్రారంభించిన తీరు ఆకట్టుకుంది.  డాకు మహారాజ్ గా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోఘం.

నందమూరి బాలకృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది. విభిన్న రూపాలలో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజ్ గా, తరువాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాలలో ఆయన పాత్ర ఉండనుంది. దర్శకుడు బాబీ కొల్లి బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా చూపిస్తున్నారు.

డాకు మహారాజ్ ని ఢీ కొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ నటించారు.  ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కథానాయికలుగా నటించారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం ఓ రేంజ్ లో ఉంది.  ట్రైలర్ లో విజువల్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి.   కొన్ని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.

డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. బాలయ్యకు సంక్రాంతి హీరోగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎన్నో సినిమాలు పొంగల్ కానుకగా విడుదలై సంచలన విజయాలు సాధించాయి. చివరగా బాలయ్య ‘వీరసింహారెడ్డి’ గా పలకరించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇపుడు ‘డాకు మహారాజ్’గా బాలయ్య సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link