Omicron : ఆ లక్షణాలుంటే న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లకండి.. ఒమిక్రాన్ ఉంది జాగ్రత్త..
కోవిడ్-19కు సంబంధించిన ఏవైనా లక్షణాలు మీలో కనపడుతుంటే జాగత్రగా వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని చెప్తోన్న పూర్తిగా రక్షణ ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి.
బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లనేవి గతంలోచాలా సాధారణంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి చాలా ప్రమాదకరంగా మారాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న కొన్ని కోవిడ్ వ్యాక్సిన్‌లు కూడా ఈ కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేయకపోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే బూస్టర్ వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు కోవిడ్‌కు సూచనలుగా భావించవచ్చు. ఇక మొదట్లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్‌ను మొదటిసారిగా గుర్తించినప్పుడు.. ఇది చాలా తేలికపాటి వ్యాధి అని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ పేర్కొన్నారు.
ఈ వేరియంట్ బారినపడిన వారిలో కూడా ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్నే చెప్పింది. అంతేకాదు డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రభావంతమైనది కాదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
ఇక డాక్టర్ కోయెట్జీ ప్రకారం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులు గొంతు నొప్పితో కాస్త ఇబ్బందిపడతారు. కొందరు తేలికపాటి నొప్పితో ఇబ్బందిపడితే.. మరికొందరు తీవ్రమైన గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని డాక్టర్ కోయెట్జీ పేర్కొన్నారు.
అంతేకాదు ఒమిక్రాన్ బారినపడిన వారికి రాత్రిపూట విపరీతంగా చెమటలు పడతాయని.. ఒళ్లంతా నొప్పులు ఉంటాయని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ నిర్వహించిన మరో అధ్యయనంలో తేలింది.
ఒమిక్రాన్ వేరియంట్ బారినపడిన వారు జలుబుతో ఇబ్బందులుపడే అవకాశం ఉంది. జలుబు చేస్తే వెంటనే RT-PCR పరీక్ష చేయించుకోవడం మంచిది. అలాగే వీలైనంత వరకు జన సమూహంలోకి వెళ్లకుండా ఉండాలి. కోవిడ్ నెగెటివ్‌గా వచ్చే వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే మేలు.
మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఒమిక్రాన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లండి. కాస్త అనారోగ్య లక్షణాలు ఉన్నా కూడా వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అనారోగ్య లక్షణాలుంటే పార్టీల్లో పాల్గొనకండి.
కడుపులో కాస్త వికారంగా ఉండడం, లేదంటే ఆకలి లేకపోవడం వంటివి కూడా ఒమిక్రాన్ లక్షణాలే అని కింగ్స్ కాలేజ్ లండన్‌లోని జెనెటిక్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ తెలిపారు.
జ్వరం, దగ్గు, అలసట వంటి లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ సంకేతాలు. అయితే స్వల్ప లక్షణాలు ఉన్నా కూడా కోవిడ్‌గా అనుమానించి టెస్ట్‌లు చేయించుకోవడం మంచిది.
న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా సెలబ్రేషెన్స్ జరుగుతూ ఉంటాయి. అందులో పాల్గొనాలని కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటేనే మంచిది.