Tholi Ekadashi: తొలి ఏకాదశి విశిష్టత.. ఈ రోజున ఈ పనులు చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో డబ్బే డబ్బు..
ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి. మొత్తంగా ఒక యేడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంలో 26 ఏకాదశులు వస్తాయి. అయితే.. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందనేది పురాణ కథనం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి 4 మాసముల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై నిద్రిస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాల కథ. అంటే వ్రతం తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు.
అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉంది. అలాగే శయనైకాదశి అని కూడా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు.
తినగూడని, విసర్జించవలసిన పదార్థాలు గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మంచంపై పడుకొనుట, బయట భుజించుట తగవు. ఈ 4 నెలలు ఇవన్నీ పనికి రానివిగా గుర్తించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు జాతక కథలలో చాల చోట్ల చెప్పబడింది. ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతకల్పం ప్రారంభించాలని భగవంతుడు యుధిష్ఠరునకు చెప్పినట్లు పురాణా కథనం.
ఈ నాలుగు మాసముల పాటు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. విష్ణువును నివేదన చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి యతులకు ఇది చాలా ముఖ్యమైన వ్రతం. గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు