Tirumala: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా? టిక్కెట్లు, జారీ చేసే కౌంటర్లు ఇవే..
వైకుంఠ ఏకాదశికి ఆ వేంకటేశుని దర్శనార్ధం ఎదురు చూస్తున్నవారికి టీటీడీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి మార్చికి సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉదయం 10 గంటల నుంచి ఉండనున్నాయి.
తాజాగా తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా టీటీడీ యంత్రాంగం నిన్న జరిగిన సమావేశంలో తీసుకుంది. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరా ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను కూడా టీటీడీ చేస్తోందని ఈఓ శ్యామలరావు మంగళవారం సమావేశంలో తెలిపారు.
తిరుమల వైకుంఠ దర్శనానికి వచ్చే భక్తులకు ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇవి పదిరోజులపాటు విక్రయిస్తారు.
ఇక మరుసటి రోజు 24వ తేదీ నుంచి ఎస్‌ఈడీ టోనెన్లు కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో వైకుంఠ దర్శన ద్వార టోకెన్లను కూడా విడుదల చేయనుంది. అదేవిధంగా తిరుమలలో ఒక కేంద్రంలో విడుదల చేస్తారు. శ్రీనివాసం, విష్ణునివాం, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్, కౌస్తుభం విశ్రాంతి భవనాల్లో ఈ టోకెన్లు విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి ఉదయం 4 గంటల సమయం నుంచి ప్రోటోకల్ దర్శనాలు కూడా ప్రారంభం అవుతాయి.
ఇక ఈ ప్రత్యేక తేదీల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే, వైకుంఠ ఏకాదశి ఈ పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం పొందాలంటే భక్తులు కచ్చితంగా ఈ టోకెన్లు కలిగి ఉండాలి. టోకెన్లు లేని యడల వారిని అనుమతించరు.
అంటే భక్తులు తిరుమలకు రావచ్చు కానీ క్యూకాంప్లెక్స్‌లలోకి అనుమతి ఉండదు. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం పొందాలంటే ఈ టోకెన్లు కలిగి ఉండాలి. ఈ పదిరోజుల పాటు వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులకు కల్పించే ప్రత్యేక దర్శనం కూడా తాత్కాలికంగా నిలిపి వేశారు.
ఈ నెల 24వ తేదీ నుంచి రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచి గదుల బుకింక్ కోటా కూడా విడుదల చేస్తారు. ఇక ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో తిరుప్పావై పటిస్తున్నారు. ఈ మాసంలో ఇది ప్రత్యేకం. సాధారణ రోజుల్లో సుప్రభాత సేవ నిర్వహించేవారు.